Share News

పీపీపీపై పెదవివిరుపు

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:44 AM

నగరంలో ప్రధాన రహదారులను పీపీపీ యాన్యుటీ/హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పీపీపీపై పెదవివిరుపు

నగరంలో 54 రహదారులను ఎంపిక చేసిన జీవీఎంసీ

నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగింత

పని పూర్తయిన తరువాత 40 శాతం బిల్లు చెల్లింపు

మిగిలిన 60 శాతం పదేళ్లపాటు ఏటా కొంత జమ

ఆ రోడ్లపై హోర్డింగ్‌లు, ఇతర ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా కాంట్రాక్టర్‌కే చెందేలా నిబంధనలు

అలాగైతే జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి

ఇండోర్‌లో అయితే ప్రకటనల ఆదాయంతోనే రోడ్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు

స్థానికసంస్థపై పడని అదనపు భారం

జీవీఎంసీలో కూడా అదే తరహాలో అమలు చేయాలని డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ప్రధాన రహదారులను పీపీపీ యాన్యుటీ/హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణ ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంట్రాక్టర్‌కు నిర్మాణం, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని చెల్లిస్తూ కూడా...ఆ మార్గంలో ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకునే అవకాశాన్ని కల్పించాలనే నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో 54 ప్రధాన రహదారులను పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) యాన్యుటీ/హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానంలో ఎంపిక చేసిన రోడ్ల నిర్మాణం, పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ఖర్చులో 40 శాతం జీవీఎంసీ చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పదేళ్లపాటు విడతల వారీగా విడుదల చేస్తుంది. ఆ పదేళ్లలో రహదారి ఎక్కడైనా దెబ్బతింటే దానిని పునర్నిర్మించే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దే. ఒకవేళ రోడ్డు నిర్వహణను కాంట్రాక్టర్‌ సరిగా చేయలేకపోతే బిల్లు చెల్లింపు నిలిపివేస్తారు. కాంట్రాక్టర్‌కు బిల్లు రాదేమోననే భయం ఉంటుంది కాబట్టి, రోడ్డు నిర్మాణంలో నాణ్యతతోపాటు నిర్వహణ కూడా బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా జీవీఎంసీ జోన్‌-2లో 31.61 కిలోమీటర్లు, జోన్‌-3 పరిధిలో 14.24 కిలోమీటర్లు, జోన్‌-4 పరిధిలో 8.65 కిలోమీటర్లు, జోన్‌-6లో 30.15 కిలోమీటర్లు మొత్తం 88.35 కిలోమీటర్లు పొడవు గల 54 రోడ్లను పీపీపీ కింద అప్పగించే అంశాన్ని ఈనెల 21న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికారులు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్బంగా కొందరు సభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్‌కు 60 శాతం బిల్లు పదేళ్ల వరకు అందకపోతే నష్టం వస్తుందని తెలిసినా ఎందుకు ముందుకువస్తారని ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ సమాధానం ఇస్తూ పదేళ్లపాటు బిల్లు పెండింగ్‌లో ఉండిపోతుంది కాబట్టి, ఆ మొత్తానికి వడ్డీ లెక్కించుకుని టెండర్‌ ఎక్కువకు వేస్తారని చెప్పారు. అలాగే ఆ రోడ్డులో హోర్డింగ్‌లు పెట్టుకుని ప్రకటనల రూపంలో ఆదాయం సంపాదించుకుంటారని, ఈ తరహా విధానం ఇండోర్‌, తిరువనంతపురం వంటి చోట్ల అమలులో ఉందని వివరించారు. దీంతో కార్పొరేటర్లు సంతృప్తి చెంది మౌనం వహించారు. ఇదిలావుండగా జీవీఎంసీలో పనిచేస్తున్న కొందరు అధికారులు మాత్రం పీపీపీ యాన్యుటీ మోడల్‌ను అమలు చేసే తీరును తప్పుపడుతున్నారు. ఇండోర్‌లో మూడేళ్ల కిందట అధ్యయనం కోసం వెళితే అక్కడ రోడ్లను కాంట్రాక్టర్లు కేవలం ప్రకటనల ఆదాయంతోనే నిర్మాణం చేపట్టి, నిర్వహిస్తున్నారని గుర్తించామని, అదే విధానం జీవీఎంసీలో కూడా అమలు చేయాలని భావించినా, పలు కారణాలతో కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. ఇప్పుడు జీవీఎంసీలో 88.3 కిలోమీటర్లు పొడవు కలిగిన 54 రోడ్ల నిర్మాణం, నిర్వహణ నిమిత్తం కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడంతోపాటు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పొందేలా నిబంధనలు రూపొందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరుతుందని, ప్రకటన రూపంలో వచ్చే ఆదాయం జీవీఎంసీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో కమిషనర్‌ పునఃపరిశీలించి జీవీఎంసీకి ఆర్థిక నష్టం కలగకుండా చూడాలని కోరుతున్నారు.

---------------------------

పీపీపీ యాన్యుటీ కింద అభివృద్ధి చేసే రోడ్లు(కి.మీ)

జోన్‌-2 31.61

జోన్‌-3 14.24

జోన్‌-4 8.65

జోన్‌-5 3.70

జోన్‌-6 30.15

మొత్తం 88.35 కిలోమీటర్లు

----------------------------------------

Updated Date - Nov 28 , 2025 | 12:44 AM