Share News

కేజీహెచ్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:10 AM

కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో సోమవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కేజీహెచ్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

  • సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో నిలిచిన వైద్య సేవలు

  • తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు

మహారాణిపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో సోమవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ అత్యంత కీలకమైనది. తీవ్ర అనారోగ్యం బారినపడినవారికి ఆ బ్లాక్‌లోనే చికిత్స అందిస్తుంటారు. ముఖ్యమైన శస్త్ర చికిత్సలు, క్యాన్సర్‌ వైద్య సేవలు, స్కానింగ్‌లు అక్కడే నిర్వహిస్తారు. అయితే సోమవారం ఉదయం ఒక్కసారిగా బ్లాక్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ కూడా పనిచేయకపోవటంతో సుమారు రెండు, మూడు గంటల పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కానింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో వైద్య సేవల కోసం కొత్తగా వచ్చిన రోగులు తిరిగి వెళ్లిపోయారు. ఐఆర్‌సీయూ విభాగంలో వైద్యులు రోగులకు కృత్రిమ శ్వాస అందించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఒక రోగి మృతి చెందినట్టు ప్రచారం జరిగినా, ఆసుపత్రి వెద్యాధికారులు ధ్రువీకరించలేదు. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో సాంకేతిక సమస్య తలెత్తి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినట్టు అధికారులు అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


ఉచిత ప్రయాణానికి డిజిటల్‌ ఐడెంటిటీ ఓకే

ఆధార్‌ జెరాక్స్‌ కాపీలకు కూడా...

వారం పాటు అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం

ద్వారకా బస్‌స్టేషన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి వారం రోజులపాటు డిజిటల్‌ ఐడెంటిటీ కార్డులు, జెరాక్స్‌ కాపీలను అనుమతిస్తున్నట్టు విశాఖ రీజియన్‌ అధికారులు సోమవారం ప్రకటించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు (రాష్ట్రానికి చెందినవారిగా ధ్రువీకరణ కోసం) ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌పాస్‌ బుక్‌, రేషన్‌ కార్డు...వీటిల్లో ఏదో ఒకటి ఐడెంటిటీగా కండక్టర్‌కు చూపించాలి. కొందరు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు చూపిస్తుండగా, మరికొందరు ఆధార్‌కార్డు జెరాక్సులు, ఇంకొందరు సెల్‌ఫోన్‌లో డిజిటల్‌ ఆధార్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ వంటివి చూపుతున్నారు. సిబ్బంది వాటిని అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. సమస్య అధికారుల దృష్టికి వెళ్లింది. అన్ని డిజిటల్‌ ఐడెంటిటీ కార్డులను వారం రోజుల పాటు అనుమతించాలని, ఈలోగా మార్గదర్శకాలు జారీచేస్తామని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులు సూచించారు. దీంతో విశాఖ రీజియన్‌లో డిజిటల్‌ ఐడెంటింటీని అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. విశాఖలో వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు ఈ పథకం వర్తించదు.

Updated Date - Aug 19 , 2025 | 01:10 AM