మన్యంలో కుండపోత
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:17 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది.
కొనసాగుతున్న వర్షాలు
వానలతో జన జీవనానికి అంతరాయం
వరద నీటితో వరి పంటకు
నష్టం కలుగుతుందని రైతుల ఆందోళన
పాడేరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాయడం తర్వాత వర్షం కురవడం సర్వసాధారణమైపోయింది. అలాగే ఆదివారం సైతం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రమైన ఎండ కాసింది. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశమంతా మేఘావృతమై వర్షం మొదలైంది. సుమారు రెండు గంటలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. అలాగే వరి నాట్లు పూర్తయిన పొలాలకు ఈ వర్షం నష్టం చేకూరుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెదబయలులో
పెదబయలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తరువాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారిపైకి వరద నీరు పోటెత్తింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బురద రోడ్లు చిత్తడిగా మారి నడవడానికి వీలు లేకుండా దర్శనమిచ్చాయి. పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
జి.మాడుగులలో..
మండలంలోని ఆదివారం జోరు వాన కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికంగా ఎండ కాసి, తరువాత వర్షం కురుసింది. దీంతో వ్యవసాయ పనులకు అటంకం కలుగుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు.
ముంచంగిపుట్టులో..
మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మాధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీపురం, బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు తదితర పంచాయతీల్లోని గెడ్డలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. మట్టి రహదారులు బురదమయంగా మారాయి. అటుగా రాకపోకలు సాగించేందుకు పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. దోడిపుట్టు పంచాయతీ రాంపుట్టు తదితర గ్రామాల్లో వరి పంట దెబ్బతింది.