Share News

కుండపోత

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:04 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లాలో భారీవర్షం కురిసింది.

కుండపోత

నగరంలో రెండు, మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వాన

లోతట్టు ప్రాంతాలు జలమయం

మల్కాపురంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం

నేడు, రేపు భారీ వర్షసూచన

విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం జిల్లాలో భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఉన్నా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, వర్షం ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ గట్టి వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వన్‌టౌన్‌, పూర్ణామార్కెట్‌, జ్ఞానాపురం, రైల్వే న్యూకాలనీ, తదితర ప్రాంతాల్లో నీరు భారీగా రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల మురుగు కాల్వులు పొంగి పొర్లాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అనేకచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ములగాడ, పెదగంట్యాడ, ఆనందపురం మండలాల్లో పెద్దఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షానికి తోడు ఈదురుగాలులు వీచాయి.

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్కాపురం జీవీఎంసీ స్కూల్‌ వద్ద 61.75, ఆనందపురం మండలం కణమాంలో 52, పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌లో 50.75, ఆనందపురం మండలంలోని గోస్తనీ పంప్‌ హౌస్‌ వద్ద 41.5, గాజువాక కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద 35.5 మిల్లీ మీటరు వర్షపాతం నమోదైంది.

బుధవారం నుంచి మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శివారు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నెల 25 నుంచి మ్సత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Sep 24 , 2025 | 01:04 AM