సీలేరు, ధారకొండల్లో కుండపోత
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:37 PM
జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
సీలేరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని గంట పాటు కుండపోతగా వర్షం పడింది. దీంతో సీలేరు, ధారకొండల్లో డ్రైనేజీలు బ్లాక్ కావడంతో వర్షపు నీరు ప్రధాన రోడ్లపై నుంచి ప్రవహించింది. రామాలయం సెంటర్ వద్ద దిగువన ఉన్న ఇళ్లల్లోకి వర్షం నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీలేరులో వర్షం కురిసిన సమయంలో ఉరుముల ధాటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గిన తరువాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
జీకేవీధిలో..
మండలంలో భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కుండపోత వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరింది.