దర్జాగా కబ్జా
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:43 AM
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమణలకు తెగబడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
ప్రభుత్వ స్థలంలో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణాలు
కళాశాల చుట్టూ రెవెన్యూ, ఫారెస్ట్ భూములు
ఇదే అదనుగా ఆక్రమణ
గోపాలపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమణలకు తెగబడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జాకు తెరతీసింది. కళాశాల చుట్టూ రెవెన్యూ, అటవీ భూములు ఉండడంతో అవకాశం ఉన్న మేరకు స్థలాన్ని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతోంది.
గ్రేటర్ 88వ వార్డు నరవ గ్రామ శివారు కొండవాలు ప్రాంతంలో విశాఖ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. దీని చుట్టూ రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ , అటవీశాఖ భూములున్నాయి. వాటిని కళాశాల యాజమాన్యం దర్జాగా వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట అప్పటి పెందుర్తి తహశీల్దార్ రెవెన్యూ, అటవీ భూముల్లో కొంత భాగానికి ఫెన్సింగ్ వేయించారు. మిగిలిన భాగంలో రక్షణ చర్యలు చేపట్టలేదు. దీనిని ఆసరాగా చేసుకుని కళాశాల భవనాలకు కొండవాలులోని ఫారెస్ట్ భూములకు మధ్య ఉన్న సర్వే నంబరు 58లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం ప్రారంభించింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు స్పందించకపోవడంతో అక్రమణలకు వారు సహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిరక్షణ చర్యలేవీ?
కళాశాల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలు ఊపందుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే మరింత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందంటున్నారు. కళాశాల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల చుట్టూ కంచె ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులు పెట్టాల్సి ఉంది.
నిర్మాణాలు ఆపించాం
విశాఖ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని సర్వే నంబరు 58లో ప్రభుత్వ భూమి ఆక్రమించి చేపడుతున్న నిర్మాణం విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించాం. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. వారు ఆదేశాలు జారీచేసిన వెంటనే తొలగింపు చర్యలు చేపడతాం.
- జి.విజయం, వీఆర్వో, నరవ