Share News

పోర్టు స్టేడియం స్వాధీనం

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:28 AM

అక్కయ్యపాలెంలోని క్రీడా ప్రాంగణం, కళావాణి ఆడిటోరియంను విశాఖపట్నం పోర్టు అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

పోర్టు స్టేడియం స్వాధీనం

కళావాణి ఆడిటోరియం కూడా...

ప్రైవేటు సంస్థల ఉద్యోగులందరినీ ఖాళీ చేయించిన సిబ్బంది

గతంలో విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్స్‌, విశ్వనాథ్‌ ఎవెన్యూస్‌కు లీజుకు ఇచ్చిన యాజమాన్యం

నిబంధనలు ఉల్లంఘించడంతో రద్దు చేస్తూ నిర్ణయం

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

అక్కయ్యపాలెంలోని క్రీడా ప్రాంగణం, కళావాణి ఆడిటోరియంను విశాఖపట్నం పోర్టు అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నెహ్రూ క్రీడా, సాంస్కృతిక సముదాయం, కళావాణి ఏసీ ఆడిటోరియంలను విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్స్‌, విశ్వనాథ్‌ ఎవెన్యూస్‌కు లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నిబంధనలు, షరతులు ఉల్లంఘించడంతో లీజు రద్దు చేస్తున్నామని సెప్టెంబరు 11న పోర్టు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దానిపై విశ్వనాథ్‌ అండ్‌ కో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ పోర్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో యాజమాన్యం ఆయా ప్రాంగణాల ముందు శనివారమే నోటీసులు ఏర్పాటుచేసింది. లీజు రద్దు చేసినందున విశ్వనాథ్‌ అండ్‌ కోతో ఎవరైనా ఒప్పందాలు చేసుకొని ఉంటే అవి చెల్లవని స్పష్టంచేసింది. దీనిపై పత్రికల్లో ఆదివారం ప్రకటన జారీచేసింది. సోమవారం ఉదయాన్నే జిల్లా రెవెన్యూ అధికారులను తీసుకొని వెళ్లి స్టేడియంతో పాటు ఆడిటోరియాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో పెద్దస్థాయిలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని స్టేడియం వద్ద పోర్టు యాజమాన్యం మోహరించింది. ఆ ప్రాంగణంలో కొన్ని విభాగాలను సబ్‌ లీజుకు తీసుకున్న వారిని, వారి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని బయటకు పంపించారు. సోమవారం రాత్రి చీకటి పడేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇదే ప్రాంగణంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కార్యాలయం, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాక్సింగ్‌ తదితర క్రీడల్లో చాలా మంది శిక్షణ పొందుతున్నారు. వారికి హాస్టల్‌ కూడా అదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. యథా ప్రకారం సోమవారం సాయంత్రం విద్యార్థులు శిక్షణ కోసం తల్లిదండ్రులతో సహా అక్కడకు రాగా సెక్యూరిటీ సిబ్బంది వారిని గేటు వద్దే నిలిపివేశారు. సాయ్‌ ఇచ్చిన గుర్తింపు కార్డులు చూపిస్తే లోపలకు పంపిస్తామని స్పష్టంచేశారు. రోజూ వస్తుండే స్టేడియమే కాబట్టి గుర్తింపు కార్డులు తేలేదని, ఆకస్మికంగా ఇలా నిబంధనలు పెడితే ఎలా అంటూ సెక్యూరిటీ సిబ్బందితో పిల్లల తల్లిదండ్రులు వాదనకు దిగారు. తమ చేతుల్లో ఏమీ లేదని, గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలకు పంపుతామని, ఇంతకు ముందులా ఎవరు పడితే వారు లోపలకు వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టంచేశారు. అలాగే స్టేడియానికి చాలామంది వాకింగ్‌ కోసం వెళుతుంటారు. వారిని కూడా ఆపేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే లోపలకు పంపించారు. సాధారణ స్థితికి రావడానికి వారం రోజుల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు.

వినియోగంపై ఆలోచన చేస్తాం

పోర్టు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, నియమ నిబంధనల ప్రకారం ఆస్తుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోర్టు యాజమాన్యం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. స్టేడియం, ఆడిటోరియాలలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

Updated Date - Dec 16 , 2025 | 01:28 AM