గోకులాలకు ఆదరణ
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:02 AM
పశుపోషణ రైతుల సంక్షేమానికి, ఆర్థికంగా వారిని ఆదుకోవడానికి కూలమి ప్రభుత్వం పలు పథకాలను ప్రకటించి అములు చేస్తున్నది. పశువులకు నీడ కోసం షెడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాల రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
80 శాతం రాయితీ ఇస్తున్న ప్రభుత్వం
పశువులకు షెడ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్న రైతులు
ఈ ఏడాది జిల్లాకు 1,290 యూనిట్లు మంజూరు
1,381 మంది రైతులు దరఖాస్తు
ఇంతవరకు 645 షెడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
వివిధ దశల్లో నిర్మాణ పనులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పశుపోషణ రైతుల సంక్షేమానికి, ఆర్థికంగా వారిని ఆదుకోవడానికి కూలమి ప్రభుత్వం పలు పథకాలను ప్రకటించి అములు చేస్తున్నది. పశువులకు నీడ కోసం షెడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని మండలాల రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పశుపోషణ రైతుల సంక్షేమం, అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అంతకుముందు టీడీపీ హయాంలో రాయితీపై మంజూరు చేసిన పశువుల షెడ్లు నిర్మించుకున్న రైతులకు కనీసం బిల్లులు కూడా చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పశుపోషణ రైతులను పలు విధాలుగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులు షెడ్లు నిర్మించుకునేందుకు ‘గోకులం’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఆయా పశువులు, జీవాలు వర్షానికి తడవకుండా, వేసవిలో ఎండబారిన పడకుండా షెడ్లు నిర్మించుకునే రైతులకు పెద్ద మొత్తంలో రాయితీని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 650 మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1,290 షెడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ఏడాది ఆరు పశువులకు సరిపడ షెడ్డు నిర్మాణ వ్యయం రూ.2.30 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. ఇందులో పది శాతం సొమ్మును రైతులు భరిస్తే.. మిగిలిన సొమ్మును ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చేది. అయితే ఈ ఏడాది ఈ షెడ్డు నిర్మాణ వ్యయాన్ని రూ.2 లక్షలకు తగ్గించింది. అర్హులైన రైతులు రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన రూ.1.8 లక్షలను ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోకులం షెడ్ల నిర్మాణానికి ఇంతవరకు 1,381 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు 645 షెడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిల్లో 41 షెడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 516 షెడ్లు వివిధ దశల్లో వున్నాయి. గోకులం షెడ్ల మంజూరుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు అంటూ ఏమీ లేదని, షెడ్లు నిర్మించుకోదలచిన రైతులు గ్రామ సచివాలయాలు, మండల పశువైద్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మంజూరు చేస్తామన్నారు.