ఆయుర్వేదానికి ఆదరణ
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:53 AM
ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఆయుర్వేద ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో వసతి సదుపాయాలను కల్పించడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమించి, సకాలంలో మందులను సరఫరా చేస్తున్నది. దీంతో ఆయుర్వే ఆస్పత్రులకు క్రమేపీ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ కమిషనర్ దినేశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇటీవల అన్ని ఆస్పత్రులకు మందులను సరఫరా చేశారు.
ఆస్పత్రులకు పెరుగుతున్న రోగుల రాక
పుష్కలంగా మందుల సరఫరా
నక్కపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఆయుర్వేద ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో వసతి సదుపాయాలను కల్పించడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమించి, సకాలంలో మందులను సరఫరా చేస్తున్నది. దీంతో ఆయుర్వే ఆస్పత్రులకు క్రమేపీ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ కమిషనర్ దినేశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇటీవల అన్ని ఆస్పత్రులకు మందులను సరఫరా చేశారు.
జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, కొరుప్రోలు, వేంపాడు, కన్నూరుపాలెం, నర్సీపట్నం, సర్వసిద్ధి, గవరవరం, దేవరాపల్లి, పరవాడ, హరిపాలెంలో ఆయుష్ ఆస్పత్రులు ఉన్నాయి. రోగులకు అవసరమైన వివిధ రకాల మందులను అందుబాటులో వుంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆయుష్షును పెంచి, ఆరోగ్యాన్ని అందించడం, ఒత్తిడిని జయించి ప్రశాంతంగా జీవించేందుకు ఆయుర్వేద మందులు ఎంతో దోహదపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. పిల్లల్లో రక్తహీనత, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అన్ని ఆయుర్వేద ఆస్పత్రుల్లో అందుబాటులో వున్నాయి. పెద్దలకు కీళ్ల వాతం, కాళ్ల నొప్పులు, షుగర్, బీపీ, చర్మవ్యాధులు, సొరియాసిస్, గ్యాస్ర్టిక్, తదితర వ్యాధుల నివారణకు మందులను ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఓపీ క్రమంగా పెరుగుతున్నది. ఒక్కో ఆస్పత్రికి రోజుకు సగటును 50 మంది వరకు వస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రుల్లో ఓపీ అధికంగా వుంటున్నది. మరోవైపు ఆస్పత్రుల ఆవరణల్లో ఆహ్లాదకరమైన వాతావరణం వుండేలా ఔషధ గుణాలుగల మొక్కలను పెంచుతున్నారు. ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేంపాడు ఆయుర్వేద ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.రఘు కోరుతున్నారు.