నాసిరకంగా బడి భోజనం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:48 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చాలా నాసిరకంగా వుందని, అన్నంలో పురుగులు వుంటున్నాయని, తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూను ఇక్కడ అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని అల్లు రామ సంతోషి అన్నంలో కనిపించిన పెంకు పురుగులను ఉపాధ్యాయుడుకి చూపించి, భోజనం బాగుండడంలేదని ఫిర్యాదు చేసింది.
రుచీపచీ లేని కూరలు, చారు
అన్నంలో పెంకు పురుగులు
అరకొరగా భోజనం చేస్తున్న విద్యార్థులు
నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్న హెచ్‌ఎ
నర్సీపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చాలా నాసిరకంగా వుందని, అన్నంలో పురుగులు వుంటున్నాయని, తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూను ఇక్కడ అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని అల్లు రామ సంతోషి అన్నంలో కనిపించిన పెంకు పురుగులను ఉపాధ్యాయుడుకి చూపించి, భోజనం బాగుండడంలేదని ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 246 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండారు. మెనూ ప్రకారం వైట్ రైస్, చారు, కూరగాయ కూర, తీపి పొంగలి, రాగి జావ పెట్టారు. చారుకి, నీళ్లకు తేడా లేకుండా వుందని, రుచీపచీ లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఏ కూరగాయతో కూర వండారో చెప్పలేని విధంగా వుందని అన్నారు. ఈ రోజే కాదని.. నిత్యం ఇదే పరిస్థితి అని, కూరలు ఒక్క రోజు కూడా బాగుండడం లేదని వాపోయారు. చాలా మంది విద్యార్థులు అరకొరగా భోజనం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మధ్యాహ్న భోజనం పథకంలో పలు మార్పులు తీసుకువచ్చారు. పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం పెట్టాలని అధికారులకు ఆదేశించించారు. బడి భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. కానీ భోజన పథకం నిర్వాహకులు మెనూను సక్రమంగా అమలు చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉడికించిన కోడిగుడ్డును అన్నతోపాటు ప్లేటులో వడ్డించాలి. కానీ కోడిగుడ్లను పక్కన పెట్టి, పిల్లలను తీసుకోమంటున్నారు. చాలా మంది విద్యార్థులు భోజనం వడ్డించుకొని గుడ్డు వదిలేస్తున్నారు. వేరుశనగ చిక్కీలు కూడా స్వయంగా విద్యార్థులకు అందజేయడం లేదు. దీని వలన విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతీరుపై పాఠశాల హెచ్‌ఎం (ఎంఈవో-1) తలుపులును వివరణ కోరగా.. భోజనం నిర్వాహకులకు చాలాసార్లు చెప్పామని, కానీ వారిలో మార్పు రావడం లేదని అన్నారు.