Share News

హైవే మరమ్మతుల్లో నాణ్యతాలోపం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:58 AM

జాతీయ రహదారి మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించింది.

హైవే మరమ్మతుల్లో నాణ్యతాలోపం

కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం

పనులపై కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

అనేకచోట్ల పైకి తేలుతున్న రాళ్లు, ఊడుతున్న తారు

ఎడ్జ్‌లు కలపడంలో నిర్లక్ష్యం..

వాహనాలు పార్కింగ్‌ చేసి ఉంటే అక్కడ వదిలేసిన వైనం

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారి మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించింది. అనేకచోట్ల కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేషనల్‌ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణలోపం ఇందుకు కారణమనే విమర్శ ఉంది. నగరం మీదుగా 16వ నంబర్‌ జాతీయ రహదారి వెళుతోంది. కొన్నాళ్లుగా ఈ రోడ్డుపై అనేకచోట్ల గుంతలు ఏర్పడడంతో దారుణంగా తయారైంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేషనల్‌ హైవే అఽథారిటీ అధికారులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని భావించారు. ఐదేళ్ల నిర్వహణను కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కొద్దిరోజుల కిందట అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ 50 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభించింది. ఇప్పటికే ఒకవైపు 40 కిలోమీటర్లు, మరోవైపు 20 కిలోమీటర్లు పనులు చేపట్టినట్టు చెబుతోంది. అయితే, ఈ పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తారు, మరికొన్నిచోట్ల రాళ్లు పైకి తేలాయి. చాలాచోట్ల రహదారి అంచులు కూడా సరిగా కలపలేదు. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడుతున్నారు. ఇక, కొన్నిచోట్ల పనులు చేపట్టకుండానే వదిలేశారు. వాహనాలు పార్కింగ్‌ చేసి ఉంటే వాటిని తీయించి అక్కడ పనులు చేపట్టాల్సిన బాధ్యత కాంట్రాక్ట్‌ సంస్థదే. అయితే, అందుకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్‌ చేసి ఉంటే ఆయా ప్రాంతాలను వదిలేసి ముందుకు వెళ్లిపోయారు. దీంతో అటువంటిచోట్ల రహదారి దారు ణంగా కనిపిస్తోంది. పనులను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడమే పనులు నాసిరకంగా ఉండడానికి కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ పనులపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:58 AM