Share News

ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ అధ్వానం

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:00 AM

జిల్లాలో పలు ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ ఘోరంగా ఉంది. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో ఆర్టీసీ డిపోలు, అనకాపల్లి, సబ్బవరం, మాడుగుల, చోడవరం, ఎలమంచిలి, మాకవరపాలెం, నర్సీపట్నం, నక్కపల్లి, కృష్ణాదేవిపేట, రావికమతం మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన గత ప్రభుత్వం డిపోల్లో, ప్రయాణికులు వేచి వుండే బస్టాండ్‌లలో మౌలిక వసతుల కల్పనపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ అధ్వానం
అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమైన దృశ్యం (ఫైల్‌ ఫొటో)

- వర్షమొస్తే మునిగిపోతున్న అనకాపల్లి కాంప్లెక్స్‌ ఆవరణ

- ఎలమంచిలిలో దుర్గంధంతో ప్రయాణికుల అవస్థలు

- వసతుల కల్పనపై దృష్టి పెట్టని అధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పలు ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ ఘోరంగా ఉంది. కనీస సదుపాయాలు లేక ప్రయాణికులకు పరీక్ష పెడుతున్నాయి. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో ఆర్టీసీ డిపోలు, అనకాపల్లి, సబ్బవరం, మాడుగుల, చోడవరం, ఎలమంచిలి, మాకవరపాలెం, నర్సీపట్నం, నక్కపల్లి, కృష్ణాదేవిపేట, రావికమతం మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన గత ప్రభుత్వం డిపోల్లో, ప్రయాణికులు వేచి వుండే బస్టాండ్‌లలో మౌలిక వసతుల కల్పనపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అన్ని ఆర్టీసీ బస్టాండ్‌లను ఆధునికీకరిస్తామని ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణలో పెట్టలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లలో పరిస్థితులు చక్కదిద్దుతారని అంతా భావించారు. కానీ ఈ ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్‌లలో సరైన మౌలిక వసతులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో టీవీలు అలంకారప్రాయంగా మారాయి. వర్షం వస్తే కాంప్లెక్స్‌ ప్రవేశ ద్వారం వద్ద వర్షపు నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుంది. నర్సీపట్నం ఆర్డీసీ డిపోలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలమంచిలి బస్టాండ్‌ ఆవరణలో సెప్టిక్‌ ట్యాంకు నిండిపోవడంతో పరిసరాల్లో బస్సుల కోసం వేచివున్న ప్రయాణికులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. పాయకరావుపేట బస్టాండ్‌ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జిల్లా తుని ఆర్డీసీ డిపో అధికారులకు అప్పగించారు. ఇక్కడ మరుగుదొడ్ల నిర్వహణ అఽధ్వానంగా ఉంది. కృష్ణాదేవిపేట ఆర్డీసీ బస్టాండ్‌ ఆవరణలో ఒక్క ఫ్యాన్‌ మాత్రమే పనిచేస్తుంది. పరిసరాల్లో రోడ్డు పనులు ఇటీవలే ప్రారంభించారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం, అడ్డురోడ్డు, కశింకోట ఆర్టీసీ బస్టాండ్‌లకు బస్సులు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. ప్రయాణికులు వేచివుండేందుకు, కూర్చోడానికి కనీసం బల్లలు కూడా లేవు. చోడవరం బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే వుంది. నీటి కొరత నెలకొనడంతో ప్రయాణికులు ఆరుబయటే మలవిసర్జన చేస్తుండడంతో బస్టాండ్‌లో ప్రయాణికులకు దుర్వాసన తప్పడం లేదు. సబ్బవరం బస్టాండ్‌లో ప్రయాణికులు వేచి వుండేందుకు బల్లలు లేవు, ఫ్యాన్‌లు గతంలో ఉన్నవి తొలగించారు. ప్రస్తుతం ఒక్క ఫ్యాన్‌ కూడా లేదు. జిల్లాలో బస్టాండ్‌ల ఆధునికీకరణ మాట అటుంచితే ఇప్పటికైనా జిల్లా అధికారులు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్‌లలో నెలకొన్న సమస్యలపై జిల్లా అధికారి ప్రవీణ మాట్లాడుతూ ఇటీవలే బదిలీపై జిల్లాకు వచ్చానని, డిపోలు, బస్టాండ్‌లలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Jul 16 , 2025 | 01:01 AM