నిండుకుండలా చెరువులు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:59 PM
జిల్లాలో సాగునీటి చెరువులు, పంట కుంటలు ఇటీవల కురిసిన వర్షాలకు కళకళలాడుతున్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంట కుంటల్లో చేరిన నీరు
తీరనున్న సాగునీటి అవసరాలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో సాగునీటి చెరువులు, పంట కుంటలు ఇటీవల కురిసిన వర్షాలకు కళకళలాడుతున్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి, చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, మండలాల్లో చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి వనరులకు జవసత్వాలు నింపేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. కొండవాగు ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని సంరక్షించేందుకు 2024-25 సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 5,514 పంట కుంటలను తవ్వకాల పనులను అధికారులు ప్రారంభించారు.
ఇందులో ఆగస్టు నెలాఖరు నాటికి 4,122 పంట కుంటల తవ్వకాల పనులు పూర్తి చేశారు. వీటిలో బుచ్చెయ్యపేట మండలంలో 183, అనకాపల్లిలో 78, అచ్యుతాపురంలో 186, చీడికాడలో 139, చోడవరంలో 189, దేవరాపల్లిలో 198, గొలుగొండలో 163, కె.కోటపాడులో 238, కశింకోటలో 197, మాడుగులలో 189, మాకవరపాలెంలో 240, మునగపాకలో 205, నక్కపల్లిలో 67, నర్సీపట్నంలో 150, నాతవరంలో 126, నాతవరంలో 219, పరవాడలో 44, పాయకరావుపేటలో 80, రాంబిల్లిలో 172, రావికమతంలో 288, రోలుగుంటలో 291, ఎస్.రాయవరంలో 165, సబ్బవరంలో 182, ఎలమంచిలి మండలంలో 133 ఉన్నాయి. అన్ని మండలాల్లో పంట కుంటలను తవ్వడం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడమే కాకుండా సాగునీటి అవసరాలకు నీరు పుష్కలంగా అందనున్నదని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. రైతులకు పండ్ల జాతి మొక్కలను పంపిణీ చేసి వాటిని పంట కుంట గట్లపై నాటించి అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.