రామవరంలో చెరువు కబ్జా
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:05 AM
ఆనందపురం మండలం రామవరం గ్రామంలో గల చెరువును కొందరు కబ్జా చేశారు.
ఎకరాకు మించి ఆక్రమణ
చోద్యంచూస్తున్న రెవెన్యూ శాఖ
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం రామవరం గ్రామంలో గల చెరువును కొందరు కబ్జా చేశారు. ప్రస్తుతానికి ఒక ఎకరా వరకూ చదును చేసి మొక్కలు నాటారు. దశల వారీగా చెరువు మొత్తం ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసుకున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబరు 86లో 4.14 ఎకరాల్లో చెరువు ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. చాలాకాలం నుంచి చెరువు కింద ఆయకట్టు భూముల్లో పంటలకు బదులుగా తోటలు వేశారు. వర్షాకాలంలో చెరువులో చేరిన నీటిని తోటల పెంపకానికి వినియోగిస్తున్నారు. అయితే చెరువుకు ఆనుకుని ప్రభుత్వ భూమిలో కొంతభాగం శ్మశానం కోసం కేటాయించారు. శ్మశానం కోసం బోరు తవ్వించారు. ఈ క్రమంలో చెరువు గర్భంలో గల మెరక ప్రాంతంపై కబ్జాదారులు కన్నేశారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఎకరా మేర స్థలాన్ని చదునుచేసి మొక్కలు నాటారు. ప్రభుత్వానికి చెందిన చెరువులో కొంత భాగాన్ని చదునుచేసి మొక్కలు నాటినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు.