Share News

అంబుజాతో కాలుష్యం ముప్పు

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:36 AM

‘పోర్టు ఆధారిత అభివృద్ధి’ పేరుతో అదానీ సంస్థ గంగవరం పోర్టు కోసం తీసుకున్న భూములను ఇతర పరిశ్రమలకు ఉపయోగించుకోవాలని యత్నిస్తోంది.

అంబుజాతో కాలుష్యం ముప్పు

  • పోర్టు ఆధారిత పరిశ్రమ అంటూ బుకాయింపు

  • ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి లక్ష్యం

  • రోజుకు ఎన్‌టీపీసీ, హిందూజా పవర్‌ప్లాంట్ల నుంచి 4 వేల టన్నుల ఫ్లైయాష్‌ తరలింపు

  • నివాస ప్రాంతాల మీదుగా రవాణా

  • ఫ్లైయాష్‌లో మెర్కురీ, సీసం, యురేనియం, ఽథోరియం వంటి రేడియో ఐసోటోపులతో పాటు కాడ్మియం, ఆర్సెనిక్‌, జింక్‌ వంటి లోహాలు కూడా ఉంటాయని నిపుణులు ఆందోళన

  • నేడు ప్రజాభిప్రాయ సేకరణ

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):

‘పోర్టు ఆధారిత అభివృద్ధి’ పేరుతో అదానీ సంస్థ గంగవరం పోర్టు కోసం తీసుకున్న భూములను ఇతర పరిశ్రమలకు ఉపయోగించుకోవాలని యత్నిస్తోంది. ఇప్పుడు అందులోని ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో సిమెంట్‌ కంపెనీ ఏర్పాటుకు నిర్ణయించింది. పెదగంట్యాడ, గాజువాక ప్రాంతాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బంది పడతారని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. ఈ సిమెంట్‌ కంపెనీ వద్దని స్థానికులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాట్లుచేసింది.

ఆది నుంచి అదే ధోరణి

వైసీపీ ప్రభుత్వ హయాంలో గంగవరం పోర్టును ప్రైవేటు వ్యక్తుల నుంచి అదానీ యాజమాన్యం బలవంతంగా టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాను సైతం జగన్మోహన్‌రెడ్డి అతి తక్కువ ధరకు అదానీకి కట్టబెట్టారు. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తినా వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి అదానీ యాజమాన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. స్టీల్‌ ప్లాంటుకు సరకు రవాణా హ్యాండ్లింగ్‌ చార్జీలను పెంచేసింది. బిల్లులు బకాయి ఉన్నారని ఆరోపిస్తూ ఒకానొక దశలో సరకు రవాణా నిలిపివేసింది. దాదాపు 45 రోజులు స్టీల్‌ ప్లాంటుకు ముడి సరకు రవాణా ఆగిపోయింది. దీంతో రూ.800 కోట్ల నష్టం వాటిల్లింది. రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. స్థానిక నిర్వాసిత మత్స్యకారులు ఎవరూ పోర్టులో పనికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. భూములు ఇచ్చిన వారి పట్ల ఏమాత్రం కనికరం చూపించలేదు.

రోజూ 4 వేల టన్నుల ఫ్లైయాష్‌ రవాణా

పెదగంట్యాడకు అత్యంత సమీపాన అంటే సుమారుగా 130 మీటర్ల దూరంలో అంబుజా సిమెంట్‌ కంపెనీ నూతన యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అదానీ సంస్థ (అంబుజా సిమెంట్స్‌ను ఏడాది క్రితం అదానీ టేకోవర్‌ చేసింది) ఏర్పాట్లు చేస్తోంది. ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. దీని కోసం సమీపంలోని ఎన్‌టీపీసీ, హిందూజా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి ఫ్లైయాష్‌ను రోజుకు నాలుగువేల టన్నులు తీసుకుంటామని చెబుతోంది. అంటే ఫ్లైయాష్‌ లారీలు నివాస ప్రాంతాల మీదుగా దాదాపుగా 14 కి.మీ ప్రయాణం చేస్తాయి. వాటి కాలుష్యం అంతా అక్కడి ప్రజలపైనే పడుతుంది. ఈ ఫ్లైయాష్‌లో విషపూరితమైన మెర్కురీ, సీసం, యురేనియం, ఽథోరియం వంటి రేడియో ఐసోటోపులతో పాటు కాడ్మియం, ఆర్సెనిక్‌, జింక్‌ వంటి లోహాలు కూడా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఫైయాష్‌ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

నీటికీ కష్టాలే

సిమెంట్‌ తయారీకి నీరు అవసరం ఎక్కువ. రోజుకు 4 వేల కిలోలీటర్లు కావాలి. ఈ పరిశ్రమకు అవసరమైన నీటిని అందించే సామర్థ్యం ప్రస్తుతం జీవీఎంసీకి లేదు. భూగర్భ జలాలు ఉపయోగించకూడదనే నిబంధన ఉంది. అందుకని అదానీ యాజమాన్యం తప్పుడు నివేదిక సమర్పించింది. గాజువాకలో మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి రోజుకు 400 కిలో లీటర్లు తీసుకుంటామని నివేదికలో పేర్కొంది. వాస్తవానికి గాజువాకలో ఆ కేంద్రమే లేదు. అది జీవీఎంసీ వద్ద ప్రతిపాదన దశలోనే ఉంది. దానిని నివేదికలో చూపించి, అక్కడి నుంచి నీటిని తీసుకుంటామని ప్రభుత్వ అనుమతులు కోరుతోంది. మిగిలిన నీటిని అంటే రోజుకు 3,600 కిలోలీటర్లు ఏలేరు కాలువ నుంచి తీసుకుంటుంది. దానివల్ల స్థానిక ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురవుతాయి. ఇవేవీ పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో పొందుపరచకపోవడం గమనార్హం.

గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు

ఈ సిమెంట్‌ పరిశ్రమ వల్ల గ్రామీణాభివృద్ధి జరుగుతుందని అదానీ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పెదగంట్యాడ, పరిసర ప్రాంతాల ప్రజలకు జీవనాధార అవకాశాలు మెరుగుపడతాయని తెలిపింది.

Updated Date - Oct 07 , 2025 | 01:36 AM