కాలుష్య కాసారం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:31 AM
పరవాడ ఫార్మాసిటీ డెవలపర్‌గా వ్యవహరిస్తున్న రాంకీ యాజమాన్యం నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నది. రసాయన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడిచిపెడుతున్నది. ఈ వ్యర్థాలు సమీపంలోని గెడ్డలు, చెరువుల్లోకి చేరి కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. పరవాడ నుంచి భరణికం వెళ్లే రహదారిలో వున్న మల్లోడిగెడ్డ వాగు ఫార్మా వ్యర్థాలతో నిండిపోయి నీరంతా నల్లగా మారిపోయింది. దీనికితోడు తీవ్రదుర్గంధం వెదజల్లుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యం
నల్లగా మారుతున్న గెడ్డలు, చెరువుల్లో నీరు
కలుషితం అవుతున్న భూగర్భ జలాలు
తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పీసీబీ అధికారులు
పరవాడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
పరవాడ ఫార్మాసిటీ డెవలపర్‌గా వ్యవహరిస్తున్న రాంకీ యాజమాన్యం నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నది. రసాయన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడిచిపెడుతున్నది. ఈ వ్యర్థాలు సమీపంలోని గెడ్డలు, చెరువుల్లోకి చేరి కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. పరవాడ నుంచి భరణికం వెళ్లే రహదారిలో వున్న మల్లోడిగెడ్డ వాగు ఫార్మా వ్యర్థాలతో నిండిపోయి నీరంతా నల్లగా మారిపోయింది. దీనికితోడు తీవ్రదుర్గంధం వెదజల్లుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
పరవాడలోని ‘విశాఖ ఫార్మా సిటీ’లో పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలు వున్నాయి. వీటిల్లో ఆయా ఉత్పత్తుల అనంతరం విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయడానికి ‘కామన్ ఎఫ్ల్యుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్’ (సీఈటీపీ) వుంది. దీనిని ఫార్మా సిటీ డెవలపర్ అయినా ‘రాంకీ’ యాజమాన్యం నిర్వహిస్తున్నది. ఆయా కంపెనీల నుంచి రసాయన/ ఫార్మా వ్యర్థాలను ఈ ప్లాంట్‌లోకి తరలించి, శుద్ధి చేయాలి. ఇందుకుగాను రాంకీ యాజమాన్యం నిర్ణీత రుసుము వసూలు చేస్తుంది. అయితే వర్షాలు కురిసినప్పుడు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా డ్రైన్ల ద్వారా బయటకు విడిచిపెడుతున్నారు. ఇవి సమీపంలోని గెడ్డల్లోకి, వాటిల్లో నుంచి సాగునీటి చెరువుల్లోకి చేరుతున్నాయి. ఈ ఏడాది మే 18వ తేదీ సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో రాంకీ యాజమాన్యం వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా మల్లోడిగెడ్డవాగులోకి విడిచిపెట్టడంతో నీరంతగా నల్లగా తయారైంది. దీంతో భరణికం మాజీ సర్పంచ్ బొండా తాతారావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీసీబీ అధికారులు రాంకీ యాజమాన్యానికి ఈ ఏడాది జూన్ 18న నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎఫ్ల్యుయంట్ ట్రీట్‌మెంట్’ ప్లాంట్ రసాయన వ్యర్థాలను యథావిధిగా బయటకు విడిచిపెడుతున్నారు. ఫార్మా వ్యర్థాలతో పరవాడ పెద్ద చెరువు, ఊర చెరువు ఇప్పటికే కలుషితమయ్యాయి. ఇందులోని నీటిని పశువులు తాగడం లేదు. రైతుల ఈ చెరువు నుంచి పొలాలకు నీరు పెట్టడం మానేశారు. గెడ్డలు, చెరువులతోపాటు భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయి.
ఫార్మా వ్యర్థ జలాలను గెడ్డవాగులోకి విడిచిపెట్టడంపై ‘ఫార్మా యాజమాన్యాల ఇష్టారాజ్యం’ అనే శీర్షికతో గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. పీసీబీ అధికారులు స్పందించి వాగులో నీటి నమూనాలను సేకరించారు. వీటికి పరీక్షలు చేయగా రసాయనాలు ఉన్నట్టు గుర్తించి, గెడ్డలోని నీటిని మోటార్లతో తోడించి రాంకీకి చెందిన సీఈటీపీకి తరలించారు. తరువాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫార్మా వ్యర్థాల కాలుష్యంపై మీడియాలో కథనాలు వచ్చినా, స్థానికులు ఫిర్యాదులు చేసినా, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించినా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాంకీ యాజమాన్యం త మ ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఫార్మా వ్యర్థ జలాలను బయటకు విడిచిపెడుతున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫార్మా వ్యర్థ జలాలతో ఇబ్బందులు
పైలా పైడంనాయుడు, పరవాడ
ఫార్మా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోకి విడిచిపెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల కాలంలో రాంకీ యాజమాన్యం మరింత బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రజాప్రతినిధులు తక్షణమే కలుగజేసుకొని వ్యర్థ జలాలు బయటకు విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకునేలా చూడాలి.
క్రిమినల్ కేసు నమోదు చేయాలి
రొంగలి గోపాలకృష్ణ, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు
ఫార్మా రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేస్తుండడంతో గెడ్డలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. ఈ విషయంలో పీసీబీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.