Share News

జడ్పీలో రాజకీయం

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:08 AM

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలను వైసీపీ సభ్యులు రాజకీయ వేదికలుగా మార్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జడ్పీలో రాజకీయం

కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయమన్నట్టు వ్యవహరిస్తున్న వైసీపీ సభ్యులు

గందరగోళంగా సర్వసభ్య సమావేశాలు

ఒక్కొక్క అంశంపై గంటల తరబడి సాగదీత

కాలం సద్వినియోగంలో సభ్యులు విఫలం

నాలుగేళ్లలో చర్చకు రాని శాఖలు ఎన్నో

విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలను వైసీపీ సభ్యులు రాజకీయ వేదికలుగా మార్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతాల్లో సమస్యలను ప్రస్తావించాల్సిన సభ్యులు కేవలం పార్టీ అజెండానే భుజాన వేసుకుని సమావేశాలను హైజాక్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజలచే ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తమ ప్రాంతం లేదా జిల్లాలో ప్రధాన సమస్యలను సమావేశంలో ప్రస్తావించి అవి పరిష్కారం అయ్యేలా చూడాల్సి ఉంది. కానీ, కొందరు ఆ విషయం వదిలేసి ఒకే అంశంపై లేనిపోని సందేహాలతో గంటలకొద్దీ చర్చ కొనసాగిస్తున్నారు.

ప్రస్తుత జడ్పీ పాలక వర్గం ఏర్పడి గత నెల 23వ తేదీకి నాలుగేళ్లు పూర్తయ్యింది. శనివారం నాటి సమావేశంతో కలిపి ఈ నాలుగేళ్లలో 17 సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. శనివారం సమావేశంలో సభ్యులతో పాటు చైర్‌పర్సన్‌ కూడా కూడా నేరుగా అధికారులపై విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది. సభా వేదిక నుంచే అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ‘జిల్లా నుంచి ఎక్కువ మంది అధికారులు రాకపోవడానికి మీ నిర్లక్ష్యమే కారణం’ అంటూ వ్యాఖ్యానించడంతో పలువురు అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. సమావేశంలోనే ఉన్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికారులు ప్రధానంగా కలెక్టర్లకు ప్రభుత్వ కార్యక్రమం తొలి ప్రాధాన్యం, జడ్పీ సమావేశం రెండో ప్రాధాన్యం అంటూ జడ్పీ సమావేశం వాయిదా వేసుకుని ఉండాల్సిందని పేర్కొనడం గమనార్హం. కాగా అల్లూరి జిల్లా అనంతగిరిలో రెండు పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టులకు అనుమతులు గత ప్రభుత్వంలోనే వచ్చాయి. వాటిపై అప్పట్లో మౌనంగా ఉన్న వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటని సమావేశంలో సభ్యుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే వైసీపీ హయాంలో జిల్లాలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక రోడ్లను బాగుచేయించింది. కానీ ఆ విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విమర్శలు చేయడంతో రాజకీయ లబ్ధికోసమేననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక, ఒక్క అంశాన్ని పట్టుకుని గంటల తరబడి సాగదీస్తున్నారు. ఇదే విషయాన్ని విపక్ష నేత బొత్స సత్యనారాయణ శనివారం ప్రస్తావించి అన్ని అంశాలకు సమయం కేటాయించాలన్నారు. సమావేశం మధ్యలో ఆయన వెళ్లిపోయిన తరువాత సమస్యలను పక్కనపెట్టి ప్రొటోకాల్‌ అంశంపై సభ్యులు చర్చించడం గందరగోళానికి దారితీసింది. ప్రతి అంశానికి నిర్దిష్ట సమయం నిర్ణయించి చర్చించేలా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్‌పర్సన్‌ చూడాలి. గడచిన నాలుగేళ్లలో అసలు చర్చకు రాని శాఖలే ఎక్కువగా ఉన్నాయి. అయినా ఆయా శాఖల అధికారులు సమావేశాలకు హాజరుకావాలని ఆదేశిస్తారు. దీంతో రోజంతా వారు జడ్పీలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. శనివారం సమావేశాలకు హాజరుకాని అధికారులను జడ్పీ అధికారులు ఆగమేఘాలపై పిలిపించారు. వారికి సంబంధించిన శాఖలపై చర్చ చేపట్టారా?...అంటే అదీ లేదు.

Updated Date - Oct 05 , 2025 | 01:08 AM