Share News

ఫిల్మ్‌ క్లబ్‌లో రాజకీయాలు!

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:22 AM

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఫిల్మ్‌ క్లబ్‌)కు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.

ఫిల్మ్‌ క్లబ్‌లో రాజకీయాలు!

  • రాజకీయ నేతలే అధ్యక్షులుగా ఉండేలా చక్రం తిప్పుతున్న వైసీప్‌ కోటరీ

  • అలాగైతేనే ప్రభుత్వం

  • భూమి కేటాయిస్తుందని ప్రచారం

  • చిత్రసీమకు చెందినవారే

  • నాయకత్వం వహించాలంటున్న మరో వర్గం

  • నగరంలో ఉన్న ఏ క్లబ్‌లోనైనా రాజకీయ నాయకులు నాయకత్వ స్థానంలో ఉన్నారా?...అంటూ ప్రశ్నలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఫిల్మ్‌ క్లబ్‌)కు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ఎవరో ఒక రాజకీయ నాయకుడు క్లబ్‌ అధ్యక్షుడిగా ఉంటే తప్ప ప్రభుత్వం భూమి కేటాయించదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. తొట్లకొండ వద్ద గతంలో ప్రభుత్వం భూమి కేటాయించిందని, అప్పుడు ఏ రాజకీయ నాయకుడు క్లబ్‌కు నాయకత్వం వహించారని ప్రశ్నిస్తోంది. వైసీపీ హయాంలో కార్యవర్గంలో చేరిన కొందరు రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఇకపై కూడా తెర వెనుక ఉండి అధికారం చలాయించడానికి యత్నిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కూటమి నాయకులను మచ్చిక చేసుకొని, వారిని క్లబ్‌కు నాయకత్వం వహించాలని ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. ఎన్నికలు నిర్వహించకుండా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

నామినేషన్ల వ్యవహారంలో సస్పెన్షన్‌

ఇటీవల క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించడానికి నామినేషన్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోశాధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌తో బ్యాలెట్‌ బాక్స్‌ తెరిపించి నామినేషన్‌ కవరు ఒకటి బయటకు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఎన్నికలను రద్దు చేశారు. విచారణ నిర్వహించారు. సంబంధిత వ్యక్తి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మూడు నెలల పాటు క్లబ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఈ నెల 15వ తేదీన ప్రకటించారు.

కాయల వెంకటరెడ్డి బృందం కీలకం

త్వరలో క్లబ్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని, పారదర్శకంగా ఉంటాయని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల క్లబ్‌ను సందర్శించిన సమయంలో ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులనే అధ్యక్షులుగా పోటీకి దింపాలని గత చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి బృందం యత్నిస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును అధ్యక్షునిగా పోటీ చేయాలని ఒత్తిడి పెడుతోంది. అలాంటి నాయకులు క్లబ్‌కు అధ్యక్షులుగా ఉంటే ప్రభుత్వం త్వరగా భూమి కేటాయిస్తుందని ఆ బృందం అనధికార వాట్సాప్‌ గ్రూపులో ప్రచారం చేస్తోంది.

చిత్రసీమవారే ఉండాలి

ఇది ఫిల్మ్‌ క్లబ్‌ కాబట్టి ఆ రంగానికి చెందిన వారే పోటీ చేయాలని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. గతంలో అలాగే క్లబ్‌ నడిచిందని, వైసీపీ హయాంలో రాజకీయం చేశారని, ఇప్పుడు అదే రాజకీయం కొనసాగించాలని చూస్తున్నారని, దీనిని తాము అంగీకరించబోమని అంటున్నారు. ముందు సంస్థ బైలా కూడా మార్చాలని, వైసీపీ వారు తరతరాలు వారే శాశ్వత సభ్యులుగా ఉండేలా బైలా నిబంధనలు మార్చారని, అవన్నీ తొలగించాలని, అందులో చిత్రసీమ వారే పోటీ చేయాలనే నిబంధన పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. నగరంలో అనేక క్లబ్‌లు ఉన్నాయని, ఎక్కడా రాజకీయ నేతలు నాయకత్వం వహించడం లేదని, కేవలం సభ్యులుగానే ఉంటున్నారని, ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా క్లబ్‌లో 990 మందికి పైగా సభ్యులు ఉండగా, ఇటీవల వివాదాలు రేగుతున్న నేపథ్యంలో 15 మంది క్లబ్‌ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఈ క్లబ్‌ను ఆధారంగా చేసుకొని కొందరు వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని, అదే గొడవలకు దారితీస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Apr 23 , 2025 | 01:22 AM