గ్రేటర్‌లో రాజకీయ సందడి
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:16 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లుపూర్తిచేశారు. ప్రధాన కార్యాలయంలోని పాతకౌన్సిల్‌హాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేశారు.
నేడు స్టాండింగ్ కమిటీ ఎన్నిక
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్
అనంతరం లెక్కింపు..ఫలితాలు వెల్లడి
కూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమే
విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లుపూర్తిచేశారు. ప్రధాన కార్యాలయంలోని పాతకౌన్సిల్‌హాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేశారు. వచ్చే ఏడాది మార్చి 13 వరకు ఉండే ఈ స్టాండింగ్ కమిటీకి పది మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కూటమి తరపున టీడీపీ నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి పది మంది పోటీలో నిలిచారు. కూటమికి 63 మంది, వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. సీపీఐ, సీపీఎంకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌తోపాటు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఓటుహక్కు కలిగిన కార్పొరేటర్లను మాత్రమే లోపలకు అనుమతిస్తామన్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారంతా విధిగా తమ గుర్తింపు కార్డును తీసుకునిరావాల్సి ఉంటుందన్నారు. కౌన్సిల్‌హాల్ బయట ఉండే ఓటర్ ఐడెంటికేషన్ ఆఫీసర్‌కు గుర్తింపు కార్డు చూపించి, స్లిప్పు తీసుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుందన్నారు. పెన్ను, పెన్సిల్, స్మార్ట్‌వాచ్‌లు, సెల్‌ఫోన్‌లు వంటి వాటిని అనుమతించబోమన్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా పది మందికి మాత్రమే ఓటు వేయాలని, అంతకుమించి ఓటు వేస్తే చెల్లని ఓటుగా పరిగణిస్తామన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పోలింగ్ ముగుస్తుందని, అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్‌బాక్స్‌లను సీల్ వేస్తామన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఓట్ల లెక్కించి, ఫలితాలను వెల్లడించడం జరుగుతుందన్నారు.
ఓటింగ్ పై కార్పొరేటర్లపై అవగాహన
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై పోటీలో నిలిచిన అభ్యర్థులతోపాటు కార్పొరేటర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. అదనపు కమిషనర్లు రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మలు ఓటు వేసే విధానం, లెక్కింపునకు సంబంధించిన అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సీపీఎం దూరం
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు ప్రకటించారు. కౌన్సిల్‌లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీపాలన మాదిరిగానే ప్రస్తుత కూటమి పాలన అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు. మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా కార్పొరేటర్లను సంతలో సరుకులు కొన్నట్టు కొనుగోలు చేశారన్నారు. సీపీఎం మొదటి నుంచి అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు. పార్టీ జిల్లా నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఓటింగ్‌కు గైర్హాజరవుతున్నట్టు స్పష్టంచేశారు.