చికెన్ వ్యర్థాలపై పోలీస్ పంచాయితీ
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:56 AM
చికెన్ వ్యర్థాల సేకరణ వ్యవహారం ఇప్పుడు కూటమి నేతకు, పోలీసులకు మధ్య వివాదానికి దారితీసింది.
అనధికారికంగా చికెన్ వ్యర్థాలు సేకరిస్తున్న వైసీపీ చోటా నేత
కూటమికి చెందిన ప్రజా ప్రతినిధితో పాటు పోలీస్ కమిషనర్‌కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు
విచారణ జరపాలని టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించిన సీపీ
స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు
కాంట్రాక్టర్లను బెదిరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్
అతడిని విడిచిపెట్టాలని టాస్క్‌ఫోర్స్ అధికారికి కూటమి నేత ఫోన్
విచారించిన తర్వాత విడిచిపెడతామని సమాధానం చెప్పడంతో ఆగ్రహం
ఇరువురి మధ్య వాగ్వాదం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
చికెన్ వ్యర్థాల సేకరణ వ్యవహారం ఇప్పుడు కూటమి నేతకు, పోలీసులకు మధ్య వివాదానికి దారితీసింది. నగరంలో చికెన్ వ్యర్థాల సేకరణకు టెండర్లు దక్కించుకున్న తమను కొందరు బెదిరిస్తున్నారన్న కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు వైసీపీ చోటా నేతను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణకు పిలవడం కూటమి నేత ఒకరికి ఆగ్రహం తెప్పించింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసి అతడిని విడిచిపెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో కూటమి నేతకు, పోలీస్ అధికారికి మధ్య వాగ్వాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
నగరంలో చికెన్ దుకాణాల వద్ద వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించేందుకు జీవీఎంసీ జోన్‌ల వారీగా టెండర్లు పిలిచింది. ఈ వ్యవహారంలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని తమ అనుచరులు, తమను ప్రసన్నం చేసుకున్న వారికి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు ఏదోలా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చికెన్ దుకాణాల నుంచి సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు కొందరు వాటిని చేపల చెరువులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుంటారు. వైసీపీ హయాంలో ఈ దందా తారస్థాయికి చేరింది. అప్పుడు చికెన్ వ్యర్థాల సేకరణ ద్వారా భారీగా ఆర్జించిన ఆ పార్టీ చోటా నేత ఒకరు...ఇప్పుడు కూడా దానిని కొనసాగించాలని భావించారు. అనుకున్నదే తడవుగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి ద్వారా కూటమి నేత ఒకరిని ప్రసన్నం చేసుకున్నారు. ఆయన ఆశీస్సులతో అనధికారికంగా చికెన్ వ్యర్థాల సేకరణ మొదలెట్టారు. అతని వాహనాలను జీవీఎంసీ నుంచి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పట్టుకుని అధికారులకు అప్పగించడం మొదలుపెట్టారు. అందుకు ప్రతిగా సదరు వైసీపీ చోటా నేత కూడా చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న కాంట్రాక్టర్ల వాహనాలను పట్టుకుని పోలీసులకు, జీవీఎంసీ అధికారులకు అప్పగించారు. దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగడంతో ఈ వ్యవహారానికి బాధ్యుడైన చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ కిషోర్‌ను జీవీఎంసీ నుంచి సరండర్ చేశారు. ఇదిలావుండగా సదరు వైసీపీ చోటా నేత ఇటీవల తమను పిలిచి వాటా కావాలని, ఇవ్వకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, వాహనాలను తిరగనివ్వనని బెదిరించారంటూ కాంట్రాక్టర్లంతా నగరంలోని ఒక ప్రజా ప్రతినిధిని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన నేత బెదిరింపులకు దిగడం, అధికారులు అతనికి వత్తాసు పలకడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసిన సదరు ప్రజా ప్రతినిధి నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లు కూడా సీపీని కలిసి తమ ఇబ్బందులను వివరించడంతో దీనిపై విచారణ జరిపి భవిష్యత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆయన ఆదేశించారు. సీపీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు వైసీపీ చోటా నేతను రెండు రోజుల కిందట స్టేషన్‌కు పిలిచారు. వాహనాలను అడ్డుకున్నా, బెదిరింపులకు దిగినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ సమయంలో కూటమికి చెందిన నేత ఒకరు...టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసి వైసీపీ చోటా నేతను తక్షణం విడిచిపెట్టాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులకు, కూటమి నేతకు మధ్య గట్టిగా వాదన జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీపీ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు.