మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:13 PM
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలతో మన్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆదివారం ప్రత్యేక పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.
ముమ్మరంగా వాహన తనిఖీలు
రాత్రి బస్సు సర్వీసులు రద్దు
ముంచంగిపుట్టు/సీలేరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలతో మన్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆదివారం ప్రత్యేక పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంతోపాటు ప్రధాన కూడళ్లలో ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు వాహన తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించి విడిచి పెడుతున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరించినట్టయితే సమాచారం అందించాలని ఎస్‌ఐ రామకృష్ణ కోరారు. వారోత్సవాల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా జోలాపుట్టు, దోడిపుట్టు గ్రామాలకు చెందిన నైట్‌హాల్ట్ బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. మండల కేంద్రానికే వాటిని పరిమితం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాలకు వెళ్లరాదని పోలీసులు నోటీసులు జారీచేశారు. జీకేవీధి మండలం సీలేరులో ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సీలేరు పోలీసులు సీఆర్‌పీఎఫ్ బలగాలతో జల్లెడ పడుతున్నారు. సీలేరు ఐటీఐ జంక్షన్‌లో వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి వివరాలను తెలుసుకొని, ఐడీకార్టులను పరిశీలిస్తున్నారు. ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.