Share News

స్టార్‌ హోటళ్లతో పోలీస్‌ శాఖ ఎంఓయూ

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:10 AM

నగరంలోని 14 స్టార్‌ హోటళ్లతో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.

స్టార్‌ హోటళ్లతో పోలీస్‌ శాఖ ఎంఓయూ

నగరానికి వచ్చే ఐపీఎస్‌ అధికారులకు బస కల్పించేలా ఒప్పందం

రెండో తేదీన డీజీపీ సమక్షంలో సంతకాలు

ఏపీలో ఇదే ప్రథమం

రూ.2 కోట్లతో పోలీస్‌ మెస్‌ ఆధునికీకరణ

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని 14 స్టార్‌ హోటళ్లతో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన ఐపీఎస్‌ అధికారులు ఎవరైనా నగరానికి వస్తే ఆ 14 హోటళ్లలో తమకు నచ్చిన చోట బస చేయవచ్చు. ఈ మేరకు వచ్చే నెల రెండో తేదీన డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా సమక్షంలో హోటళ్ల యజమానులు, నగర పోలీస్‌ కమిషనర్‌ ఒప్పంద పత్రాలు మార్చుకోనున్నారు. ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఏపీలో ఇదే ప్రథమం.

ప్రస్తుతం ఐపీఎస్‌ అధికారులు ఎవరైనా నగరానికి వస్తే బీచ్‌రోడ్డులోని సన్‌రైజ్‌ గెస్ట్‌హౌస్‌ (పోలీస్‌ మెస్‌)లో బస కల్పిస్తున్నారు. అందులో కేవలం 16 గదులు మాత్రమే ఉన్నాయి. ఏవైనా అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటనల సందర్భంలో గదుల సమస్య ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి నగరంలోని త్రీస్టార్‌, ఫోర్‌ స్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటళ్ల యజమానులతో ఇటీవల భేటీ అయ్యారు. పోలీస్‌ అధికారులు నగరానికి వచ్చినప్పుడు వారికి ప్రభుత్వం ఇచ్చే టీఏ, డీఏలను హోటల్‌కు చెల్లిస్తారని, ఆ మొత్తాన్ని తీసుకుని వారికి వసతితోపాటు భోజన సదుపాయం కల్పించాలని ప్రతిపాదించారు. ఇందుకు 14 హోటళ్ల యజమాన్యాలు అంగీకరించాయి. దీంతో ఈనెల రెండో తేదీన డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా నగరానికి వచ్చినపుడు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అలాగే బీచ్‌రోడ్డులోని పోలీస్‌ మెస్‌ను నిర్మించి చాలాకాలమైంది. దానికి రిపేర్లు, లిఫ్ట్‌, టెర్రస్‌ గార్డెన్‌ వంటి హంగులు, సదుపాయాలు కల్పించేందుకు రూ.రెండు కోట్లు వరకు ఖర్చుపెట్టాలని సీపీ నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులకు డీజీపీ అదేరోజు ప్రారంభించనున్నారు. అలాగే నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన పది వేల కిలోలకుపైగా గంజాయిని కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డులో డీజీపీ, జిల్లా అధికారుల సమక్షంలో అదేరోజు దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వచ్చే నెల 14,15 తేదీల్లో నగరంలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్‌ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించనున్నారు.


డీసీపీ-1గా జగదీశ్

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో డీసీపీ-1గా జగదీశ్‌ అడహల్లిని నియమిస్తూ డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2020 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన జగదీశ్‌ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. డీసీపీ-1గా పనిచేసిన అజితా వేజెండ్లకు గత నెలలో బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. డీసీపీ-2 మేరీప్రశాంతి ప్రస్తుతం డీసీపీ-1గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 01:10 AM