పోలీసులు అప్రమత్తం
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:42 AM
మారేడుమిల్లిలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ఈ నెల 23న నిరసన దినం పాటించాలని మావోయిస్టులు ప్రకటించడంతో జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.
నేడు మావోయిస్టుల నిరసన దినం సందర్భంగా ముమ్మరంగా వాహన తనిఖీలు
ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు
పాడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లిలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ఈ నెల 23న నిరసన దినం పాటించాలని మావోయిస్టులు ప్రకటించడంతో జిల్లాలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడతారనే అనుమానంతో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వాహనాలు, వ్యక్తులను సైతం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలతోపాటు గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాపైనా నిఘా పెట్టారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, సీలేరు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లను మరింత అప్రమత్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా మీదుగా జిల్లాలోని మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా, బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు నైట్ సర్వీసులను శనివారం నుంచే నిలిపి వేశారు. మావోల నిరసన దినం నేపథ్యంలో ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశాలతో డీఎస్‌పీ షెహబాజ్ అహ్మద్ నేతృత్వంతో సీఐ డి.దీనబందు ప్రత్యేక బృందాలతో పాడేరు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పాడేరు పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతల అంశంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఎక్కడికక్కడ నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సుల నిలిపివేత
పాడేరురూరల్: మావోయిస్టులు ఈ నెల 23న నిరసన దినం పాటించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాడేరు ఆర్టీసీ డిపో పరిధిలోని కొన్ని నైట్ హాల్ట్ బస్సులు శని, ఆదివారాలు నిలుపుదల చేస్తున్నామని పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు తెలిపారు. పాడేరు నుంచి భద్రాచలం, డొంకరాయి, రంపచోడవరం వెళ్లే బస్సు సర్వీసులను రద్దు చేశామన్నారు. గూడెం నైట్ హాల్ట్ బస్సును జీకేవీధి పోలీస్ స్టేషన్ వద్ద, మంప నైట్ హాల్ట్ రెండు బస్సులను కొయ్యూరు పోలీస్ స్టేషన్ వద్ద, జోలాపుట్టు, దోడిపుట్టు నైట్ హాల్ట్ బస్సులను ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ వద్ద, లోతేరు, గుంటసీమ, గెమ్మెలి, ఉప్ప నైట్ హాల్ట్ బస్సులను అరకులోయ పోలీస్ స్టేషన్ వద్ద నిలిపే విధంగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
భద్రాచలం- విశాఖపట్నం నైట్ సర్వీసులు కూడా..
సీలేరు: మావోయిస్టులు నిరసన దినం పాటించాలని పిలుపునివ్వడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీలేరు మీదుగా నడిచే నైట్ సర్వీసులను రద్దు చేశామని విశాఖపట్నం డిపో డీఎం మాధురి తెలిపారు. సీలేరు మీదుగా నడిచే విశాఖపట్నం- భద్రాచలం, అలాగే విశాఖపట్నం- సీలేరు నైట్ సర్వీసులను శని,ఆదివారాలు రద్దు చేశామన్నారు. కాగా బంద్‌కు ఒక రోజు ముందు నుంచే రాత్రి సర్వీసులు రద్దు కావడంతో ఈ ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.