Share News

పోలీసుల అప్రమత్తం

ABN , Publish Date - May 23 , 2025 | 11:03 PM

జిల్లాకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు, ఒడిశాలో మావోయిస్టు కదలికల నేపథ్యంలో గత రెండు రోజులుగా జిల్లాలోని పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎక్కడపడితే వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులపై ప్రత్యేక నిఘా పెంచారు.

పోలీసుల అప్రమత్తం
పాడేరులోని కారును తనిఖీని చేస్తున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌ ఘటన నేపథ్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ

నెలాఖరుకు సీఎం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక నిఘా

పాడేరు, మే 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పాడేరు, రంపచోడవరం డివిజన్లు ఒడిశాకు సరిహద్దున ఉండగా.. చింతూరు రెవెన్యూ డివిజన్‌ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దున ఉంది. అలాగే ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతుండడం, ప్రత్యేక పోలీసుల బలగాలదే పైచేయి కావడంతో అధిక సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. దీంతో అవకాశం ఉన్న మేరకు తలదాచుకునేందుకు మావోయిస్టులు సరిహద్దున ఉన్న ఒడిశా రాష్ట్రంలోని తరలిపోతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా మావోయిస్టు అధినేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందడంతో తమ ఉనికి కోసం మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడతారనే అనుమానంతో జిల్లా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సరిహద్దులో ఉండే ప్రదేశాల్లో గాలింపులు కొనసాగిస్తూనే, ఆయా బోర్డర్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్లకు అదనపు భద్రత కల్పించారు.

మరింతగా వాహన తనిఖీలు

ఏజెన్సీలో నిత్యం పోలీసులు వాహన తనిఖీలు చేపడతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో తాజా కాల్పుల ఘటనలతోపాటు ఈనెలాఖరున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు పర్యటన నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. గతంలో జిల్లా కేంద్రంలో ఏదో ఒక ప్రదేశంలో వాహన తనిఖీలు చేపట్టేవారు. కానీ గత రెండు రోజులు జిల్లా కేంద్రానికి వచ్చే మూడు దారులు విశాఖపట్నం, చింతపల్లి, అరకులోయ మార్గాల్లోని ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే నిఘా వర్గాల సైతం అనుమానితులు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. అటు ముంచంగిపుట్టు, పెదబయలు, ఇటు చింతూరు, వై.రామవరం, అడ్డతీగల ప్రాంతాల్లోనూ వాహన తనిఖీలను పెంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం జిల్లాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా గట్టి నిఘా పెట్టారు. ఇదే పరిస్థితి మరో పది రోజుల వరకు కొనసాగే అవకాశాలున్నాయని పోలీసులు అంటున్నారు.

Updated Date - May 23 , 2025 | 11:03 PM