నవంబరుకల్లా అనకాపల్లికి పోలవరం నీరు
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:18 AM
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీటిని ఈ నవంబరు నాటికి అనకాపల్లి వరకూ తీసుకువస్తామని విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం నీటిని ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు.
వచ్చే ఏడాది నాటికి ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు
విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీటిని ఈ నవంబరు నాటికి అనకాపల్లి వరకూ తీసుకువస్తామని విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం నీటిని ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాల వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు. విశాఖ నగరం, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన నీరు పోలవరం నుంచి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పోలవరం నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి 4.5 టీఎంసీల సామర్థ్యంతో చెరువుల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.