రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:13 PM
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో: 517 జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
12 మండలాలతో ఏర్పాటు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో: 517 జారీ చేసింది. రంపచోడవరం అసెంబ్లీ స్థానంలోని మండలాలతోనే కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే వై.రామవరం మండలంలోని గుర్తేడు కేంద్రంగా కొత్త మండలంతో కలిపి మొత్తం 12 మండలాలు కానున్నాయి. దీంతో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, గుర్తేడు, దేవిపట్నం, రాజవొమ్మంగి, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ఎటపాక మండలాలతో పోలవరం జిల్లా రూపుదిద్దుకుంటుంది.
విస్తరించిన అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి
అరకులోయ పార్లమెంట్ స్థానంలో ఇన్నాళ్లు మూడు జిల్లాలుండగా, తాజాగా జరిగిన జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటి వరకు అరకులోయ లోక్‌సభ స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే విశేషం ఏమిటంటే సాలూరు అసెంబ్లీ స్థానంలో ఉన్న మెంటాడ మండలం విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌లో ఉంది. దీంతో ఇన్నాళ్లూ అరకులోయ పార్లమెంట్‌లో అల్లూరి, పార్వతీపురం, విజయనగరం జిల్లాలు మాత్రమే ఉండగా, తాజాగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ స్థానాన్ని పోలవరం పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేస్తుండడంతో ఇకపై అరకులోయ లోక్‌సభ స్థానం పరిధిలో నాలుగు జిల్లాలు ఉంటాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాలు
ఇన్నాళ్లూ 22 మండలాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇకపై 11 మండలాలతోనే కొనసాగుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం- 1974 ప్రకారం ఈ జీవోను జారీ చేసినట్టు పేర్కొంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ స్థానాన్ని పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం తుది నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇక నుంచి పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం పదకొండు మండలాలు మాత్రమే ఉంటాయని జీవో: 516లో పేర్కొన్నారు.