Share News

పోలవరం జిల్లా యథాతథం

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:30 PM

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు కొలిక్కి వచ్చింది. గత నెల 27న తొలి నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగానే 18 మండలాలతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 31న తుది నోటిఫికేషన్‌ జారీ కానుంది.

పోలవరం జిల్లా యథాతథం
రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం

ఎటువంటి మార్పులు లేవని ప్రకటించిన ప్రభుత్వం

31న తుది నోటిఫికేషన్‌

18 మండలాలతోనే రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలతో పాటు పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలు కలుపుతూ కొత్త జిల్లాను ఏర్పాటుకు నవంబరు 25న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలవరం జిల్లాలో కలిసే మండలాలు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. కానీ పోలవరం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి మార్పులు లేవని ప్రభుత్వం శనివారం ప్రాథమికంగా తెలిపింది.

18 గిరిజన మండలాలతో పోలవరం జిల్లా

జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా 18 మండలాలతో పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, దేవిపట్నం, రాజవొమ్మంగి, చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం, ఎటపాక మండలాలు, పోలవరం నియోజకవర్గంలోని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.సరసాపురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కలిపి 18 గిరిజన మండలాలతో పోలవరం జిల్లాగా ఏర్పడనుంది. ఆయా ప్రాంతీయులకు జిల్లా కేంద్రం చేరువ కావడంతో పాటు అధికారులకు పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. జిల్లాల పునర్విభజనతో ఇకపై పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 11 మండలాలకే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిమితం కానుంది.

చింతూరు, రంపచోడవరం వాసులకు వరం

రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాల ప్రజలకు జిల్లా కేంద్రం పాడేరు చాలా దూరమైపోయింది. దీంతో తమను అల్లూరి జిల్లా నుంచి వేరు చేయాలనే ఆ డివిజన్ల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పాడేరు జిల్లా కేంద్రం రావాలంటే రంపచోడవరం డివిజన్‌కు చెందిన ప్రజలకు 150 కిలోమీటర్లు, చింతూరు డివిజన్‌ వాసులు 250 కిలోమీటర్ల దూరం రావలసి ఉంది. ఇందుకు ఒక రోజు పడుతుంది. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్‌లు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో వివిధ శాఖల జిల్లా అధికారులు సైతం పాడేరు డివిజన్‌కే పరిమితమవుతున్నారు. దీంతో ఆ రెండు డివిజన్‌ల వారికి జిల్లా పరిపాలనతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పోలవరం పేరుతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించడంతో తమ కష్టాలు తీరాయని ఆప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:30 PM