పోలవరం జిల్లా ఖరారు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:48 AM
ర ంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు సోమవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం లభించింది.
12 మండలాలతోనే రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు నిర్ణయం
31న తుది నోటిఫికేషన్ జారీకి సర్కారు సన్నద్ధం
11 మండలాలకే పరిమితం కానున్న అల్లూరి సీతామరాజు జిల్లా
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ర ంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదన దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు సోమవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం లభించింది. అయితే గతంలో అనుకున్నట్టుగా రంపచోడవరం, పోలవరం అసెంబ్లీ స్థానాలను కలిపి కాకుండా కేవలం రంపచోడవరం అసెంబ్లీ స్థానంలోని 12 మండలాలు(కొత్తగా ఏర్పడే గుర్తేడుతో కలిపి)తోనే కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడంతో తమ కష్టాలు తీరాయని రంప, చింతూరు ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
12 గిరిజన మండలాలతో ‘పోలవరం’ జిల్లా
జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా 12 మండలాలతో పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుత ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలను కొత్త జిల్లాలో కలపాలని ప్రతిపాదించినప్పటికీ, ప్రజల అభ్యర్థన మేరకు కేవలం రంపచోడవరం అసెంబ్లీ స్థానంలోని మండలాలతోనే కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, దేవిపట్నం, రాజవొమ్మంగి, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ఎటపాక మండలాలతో పాటు వై.రామవరం మండలంలో గుర్తేడు కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే మండలాన్ని కలుపుకొని మొత్తం 12 మండలాలతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతీయులకు జిల్లా కేంద్రం చేరువకావడంతో పాటు అధికారులకు పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏర్పడే పోలవరం జిల్లాలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలో 3 లక్షల 49 వేల 953 మంది జనాభా ఉంటారు. కాగా తాజా జిల్లాల పునర్విభజనతో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం పదకొండు మండలాలకే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిమితం కానుంది. దీంతో ఈ జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 11 మండలాలు, 6 లక్షల 4 వేల 47 మంది జనాభా మాత్రమే ఉంటారు.