Share News

పోలవరం జిల్లా షురూ!

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:45 PM

రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం గురువారం ఆదేశించింది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌(జీవో ఆర్‌టీ నెం:1492)ను జారీ చేశారు.

పోలవరం జిల్లా షురూ!
రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం

ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలని కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశం

18 మండలాలతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఈ నెల 25నే సీఎం ఆమోదం

పాడేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం గురువారం ఆదేశించింది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌(జీవో ఆర్‌టీ నెం:1492)ను జారీ చేశారు.

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలతోపాటు పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలు కలుపుతూ కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 25న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించడం, అందుకు సీఎం చంద్రబానాయుడు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలవరం జిల్లాలో కలిసే మండలాలు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. అలాగే ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అనంతరం దానిపై వచ్చిన అభ్యంతరాలు, ఇతర సవరణను అధికారులు పరిగణనలోకి తీసుకుని, తరువాత తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

చింతూరు, రంపచోడవరం వాసులకు వరం

రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 11 మండలాల ప్రజలకు జిల్లా కేంద్రం చాలా దూరమైపోయింది. దీంతో తమను అల్లూరి జిల్లా నుంచి వేరు చేయాలనే డిమాండ్‌ ఏర్పడింది. రంపచోడవరం డివిజన్‌కు చెందిన ప్రజలకు 150 కిలోమీటర్లు, చింతూరు డివిజన్‌ వాసులకు 250 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం ఉండడంతో పాడేరు రావాలంటే ఆ ప్రాంతీయులకు ఒక రోజు పడుతుంది. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్‌లు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సైతం పాడేరు డివిజన్‌కే పరిమితమవుతున్నారు. దీంతో ఆ రెండు డివిజన్‌ల వారికి జిల్లా పరిపాలనతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పోలవరం పేరుతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడంతో తమ కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:45 PM