టీచర్‌ను నియమించండి ప్లీజ్..
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:33 AM
మండలంలోని మూలపేట పంచాయతీ జాజిలబంధ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ విద్యార్థులు మంగళవారం చేతులు జోడించి నిరసన తెలిపారు.
జాజిలబంధ గ్రామంలో చిన్నారుల నిరసన
పాఠశాలకు భవనం లేకపోగా ఉపాధ్యాయుడు కూడా లేరంటూ తల్లిదండ్రుల ఆవేదన
కొయ్యూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేట పంచాయతీ జాజిలబంధ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ విద్యార్థులు మంగళవారం చేతులు జోడించి నిరసన తెలిపారు. గ్రామంలో 33 మంది చిన్నారులు చదువుకుంటున్నారని, కనీసం పాఠశాలకు భవనం లేకపోగా, ఉపాధ్యాయుడు కూడా లేరని చిన్నారుల తల్లిదండ్రులు వాపోయారు. రెండేళ్ల క్రితం వరకు ఉపాధ్యాయుడు ఉన్నారని, ఆయన బదిలీ కావడంతో వేరొకరిని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని వారు కోరారు.