Share News

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:37 AM

విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని గురువారం పక్షి ఢీకొన్న ఘటనపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

ఎయిరిండియా ఘటనపై సర్వత్రా ఆందోళన

విమానాశ్రయ పరిసరాల్లో అధ్వానంగా పారిశుధ్యం

పక్షుల సంచారానికి అదే కారణం

ఇటీవల సమావేశంలో హెచ్చరించిన కలెక్టర్‌

స్పందించని అధికారులు

ఎయిర్‌పోర్టులోనే ఎయిరిండియా విమానం

మరమ్మతులు చేస్తున్న సాంకేతిక నిపుణులు

గోపాలపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని గురువారం పక్షి ఢీకొన్న ఘటనపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెనుప్రమాదం తప్పిందని చెబుతున్నారు. విమానాశ్రయ పరిసరాల్లో పక్షుల సంచారానికి ప్రధాన కారణం పారిశుధ్య చర్యలు సవ్యంగా చేపట్టకపోవడమేనని భావిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పారిశుధ్యం సమస్యనే ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ యంత్రాంగం సత్వరం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖపట్నం నుంచి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేసిన విషయం తెలిసిందే. టేకాఫ్‌ అయిన పది నిమిషాలకే విమానం రెండో నంబరు ఇంజన్‌ను ఓ పక్షి ఢీకొనడంతో పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెనుప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ఇటీవల గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తుచేసుకుని ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.

హెచ్చరించినా చర్యలు నిల్‌

విమానాశ్రయ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సరిగ్గా నెల రోజుల కిందట విమానాశ్రయ పర్యావరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, ఐఎన్‌ఎస్‌ డేగా, జీవీఎంసీ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పారిశుధ్యం పైనే చర్చించారు. పోర్టు సమీప గెడ్డల్లో పూడికతీత చేపట్టలేదని, పోర్టు ట్రక్‌ పార్కింగ్‌ ప్రాంతంలో డ్రైవర్లు ఆహార వ్యర్థాలు వేస్తున్నట్టు గుర్తించామని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎన్‌.పురుషోత్తం సమావేశంలో ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పక్షుల సంచారం పెరిగి విమాన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ప్రస్తావించారు. గురువారం నాటి ఘటన విమానాశ్రయ పరిసరాల్లో పరిశుభ్రతపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.

ఎయిర్‌పోర్టులోనే విమానం

పక్షి ఢీకొన్న ఘటనలో మరమ్మతులకు గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలోనే ఉన్నట్టు సమాచారం. దానికి సాంకేతిక నిపుణులు మరమ్మతులు చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 20 , 2025 | 01:37 AM