Share News

గంజాయి కట్టడికి ప్రణాళికలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:40 PM

జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

గంజాయి కట్టడికి ప్రణాళికలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పాడేరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం గంజాయి నిర్మూలనపై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు, వినియోగంపై అధికారులకు పక్కా సమాచారం ఉండాలని, జిల్లాలో గంజాయి సాగు చేయడానికి ఎవరూ సాహసించకూడదన్నారు. ఏ ప్రాంతం నుంచి గంజాయి రవాణా జరుగుతున్నది, గత సమావేశఽంలో చర్చించిన అంశాలపై ప్రగతి తెలపాలన్నారు. అలాగే గంజాయి సాగుతో కలిగే నష్టాలపై ప్రజలకు, వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులను గంజాయి సాగు నుంచి విముక్తి చేసి, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలన్నారు. గంజాయి సాగును వీడిన గిరిజన రైతులకు స్వయం ఉపాధి కల్పన, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలన్నారు. విద్యాలయాల్లో స్పోర్ట్స్‌ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల పెట్టెలు పెట్టాలన్నారు. ఆదికర్మ యోగి సేవా కేంద్రాల్లోని సిబ్బందికి గంజాయి సాగు, రవాణాను గుర్తించేలా అవసరమైన శిక్షణలు అందించాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, సమాజంలోనూ మార్పు రావాలన్నారు. గంజాయి ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని, గంజాయి స్మగ్లర్లకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతి చోటా పటిష్ట నిఘా పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌, శుభంనొక్వల్‌, డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, సీపీవో ప్రసాద్‌, ఎల్‌డీఎం మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 11:40 PM