Share News

రేషన్‌ డీలర్లకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:36 AM

రేషన్‌ డీలర్లకు వచ్చే కమీషన్‌ కాకుండా అదనంగా ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

రేషన్‌ డీలర్లకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు
డీలర్లతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్‌, పక్కన పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్‌ గౌడ

- మంత్రి నాదెండ్ల మనోహర్‌

అనంతగిరి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డీలర్లకు వచ్చే కమీషన్‌ కాకుండా అదనంగా ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మండలంలోని హరిత రిసార్ట్స్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఉదయం పాడేరు డివిజన్‌ పరిధిలోని పలు మండలాల రేషన్‌ డీలర్లు, సేల్స్‌మన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ దుకాణాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా, ప్రతి కార్డుదారుడికీ రేషన్‌ అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, ఒంటరి, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి సరుకులను అందించాలని ఆదేశించారు. డిపోల వద్ద నిత్యావసర సరుకులు అందించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, సామాన్యుడికి సైతం ధరలు అందుబాటులో ఉండేలా సరుకులు అందించనున్నామన్నారు. జీసీసీతో సమన్వయం చేసుకుని, మినీ మార్కెట్లు అందుబాటులోకి తీసుకువస్తామని, రేషన్‌ డీలర్లకు వస్తున్న ఆదాయం కాకుండా మరింత ఆదాయం సమాకూర్చేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఆందోళన చెందనవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలోని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్‌గౌడ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:36 AM