Share News

అక్రమాలకు ‘ప్లానింగ్‌’!

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:21 AM

జీవీఎంసీలో అత్యంత కీలకమైన ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ...ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులొత్తుతూ వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అవసరం లేని రోడ్లను విస్తరించాలంటూ ఆగమేఘాల మీద రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఆర్‌డీపీ) తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు స్థలాలతోపాటు వివాదాల్లో ఉన్న స్థలాలకు సైతం టీడీఆర్‌లు జారీచేసేందుకు సహకరిస్తున్నారు.

అక్రమాలకు ‘ప్లానింగ్‌’!

లోపించిన స్కానింగ్‌

వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం

ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు

జారీచేస్తున్న టౌన్‌సర్వేయర్లు

చేజారిపోతున్న జీవీఎంసీ ఆస్తులు

ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా

కొందరు అఽధికారుల నిర్ణయాలు

అవసరంలేని చోట కూడా రోడ్డు విస్తరణకు ఆర్‌డీపీలు

ఆపై వెంటనే టీడీఆర్‌ జారీకి పావులు

జీవీఎంసీ ఆస్తులపై లోపించిన పర్యవేక్షణ

ఎస్టేట్‌ విభాగంపై పర్యవేక్షణ కరువు

బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులు మీనమేషాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలో అత్యంత కీలకమైన ‘టౌన్‌ప్లానింగ్‌’ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ...ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులొత్తుతూ వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అవసరం లేని రోడ్లను విస్తరించాలంటూ ఆగమేఘాల మీద రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఆర్‌డీపీ) తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు స్థలాలతోపాటు వివాదాల్లో ఉన్న స్థలాలకు సైతం టీడీఆర్‌లు జారీచేసేందుకు సహకరిస్తున్నారు. జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు ఆస్తులుగా నిర్ధారిస్తూ సర్వేయర్లు నిర్భయంగా సర్టిఫికెట్లు జారీచేసేస్తున్నారు.

జీవీఎంసీ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఎస్టేట్‌ విభాగం ఉంటుంది. కమిషనర్‌, చీఫ్‌ సిటీప్లానర్‌ పర్యవేక్షణలో తహశీల్దార్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆ విభాగం పనిచేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ ఆస్తులపై ఏదైనా వివాదం తలెత్తినా, ఎవరైనా ఆక్రమించేందుకు యత్నించినాసరే ముందుగా సర్వేయర్లు గుర్తించి ప్రాథమికసమాచారం సేకరించి ఎస్టేట్‌ అధికారి ద్వారా చీఫ్‌ సిటీప్లానర్‌, జీవీఎంసీ కమిషనర్‌కు చేరవేయాలి. అలాగే ఏదైనా భవన నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌కు దరఖాస్తులు వచ్చినప్పుడు ఆ స్థలానికి సమీపంలో ప్రభుత్వ ఆస్తులు, గెడ్డలు, కొండపోరంబోకు వంటి భూములు ఏవైనా ఉంటే...ఆయా జోన్‌ల సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతే ప్లాన్‌ జారీపై అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతటి కీలకమైన ఎస్టేట్‌ విభాగంలో ప్రస్తుతం ఏడుగురు టౌన్‌ సర్వేయర్లు పనిచేస్తున్నారు. వీరంతా ల్యాండ్‌ అండ్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌ నుంచి డిప్యూటేషన్‌పై జీవీఎంసీకి వచ్చారు. అయితే సర్వేయర్లలో కొందరు జీవీఎంసీ ప్రయోజనాలను విస్మరించి తమకు లబ్ధి చేకూర్చే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సర్టిఫికెట్లు జారీచేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్ల కిందట జోన్‌-2 (మధురవాడ) పరిధిలో సాయిప్రియాలేఅవుట్‌ సమీపంలో అపార్టుమెంట్‌ నిర్మాణానికి ఒకరు దరఖాస్తు చేసుకోగా, ఆ స్థలంలో కొంతప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, ప్రైవేటు స్థలంగా నిర్ధారిస్తూ అప్పటి టౌన్‌ సర్వేయర్‌ కుమారస్వామి సర్టిఫికెట్‌ జారీచేశారు. ఆ తర్వాత విషయం బయటపడడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్ల కిందట శివాజీపాలెంలోని ఒక అపార్టుమెంట్‌ నిర్మాణంలో గెడ్డ బఫర్‌జోన్‌ను ఆక్రమించినప్పటికీ ఆ అపార్టుమెంట్‌కు ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ జారీచేయడానికి సర్వేయర్‌ రిపోర్టు అవసరమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు రిమార్కు రాశారు. అప్పటి టౌన్‌ సర్వేయర్‌ అపార్టుమెంట్‌ నిర్మాణం ప్రైవేటు స్థలంలోనే జరిగిందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంటూ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో అధికారులు ఓసీ జారీచేసేశారు. తాజాగా రాజేంద్రనగర్‌ పార్కు విషయంలో కూడా దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ కొంతభూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదంటూ సర్వేయర్‌ సర్టిఫికెట్‌ జారీచేసేశారు. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా తన స్థలానికి వీఎల్‌టీ (ఖాళీ స్థలం పన్ను) విధించాలని సదరు ప్రైవేటు వ్యక్తి జీవీఎంసీ రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. జోనల్‌ కమిషనర్‌ స్థాయి వరకు వీఎల్‌టీ విధించేందుకు వీలుగా సిఫారసు చేసినా, డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) మాత్రం ఆ స్థలంపై దశాబ్దాలుగా వివాదం ఉందని, అందులో ప్రభుత్వ భూమి లేదని నివేదిక తీసుకురావాలంటూ వీఎల్‌టీ దరఖాస్తును తిరస్కరించారు. దాంతో ప్రైవేటు వ్యక్తి వీఎల్‌టీ విధించేలా ఆదేశాలివ్వాలంటూ సర్వేయర్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా కోర్టుకు వెళ్లారు. అదే సర్వేయర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఆ స్థలంపై వివాదమే లేకుండా జీవీఎంసీ ఆధీనంలో ఉండేది.

టీడీఆర్‌ల జారీకి అధికారులు ఉత్సాహం

ఎవరైనా టీడీఆర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటేచాలు దాని పూర్వాపరాలు, వాస్తవాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కొందరు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు టీడీఆర్‌లు జారీచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవళ్లపాలెంలో దశాబ్దాల కిందట నిర్మించిన రోడ్డులో తమ కుటుంబ సభ్యులకు చెందిన స్థలం పోయిందని పేర్కొంటూ ఆమధ్య ఒకరు దరఖాస్తు చేసుకుంటే వెనుకాముందు చూడకుండా అధికారులంతా అనుకూలంగా రిపోర్టు పంపించగా, అప్పటి కమిషనర్‌ సాయికాంత్‌వర్మ రూ.208 కోట్ల విలువైన టీడీఆర్‌ను జారీచేసేశారు. దీనిపై కొందరు కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో ఆ టీడీఆర్‌ను అబియన్స్‌లో పెట్టారు. అలాగే సిరిపురం కూడలిలో వైసీపీ నేత నిర్మిస్తున్న బహుళ అంతస్థుల నిర్మాణానికి మేలు చేకూర్చేలా అప్పటి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశీల్‌మెట్ట నుంచి సిరిపురం వరకు ఉన్న రోడ్డుని ఇప్పట్లో విస్తరించాల్సిన అవసరం లేకపోయినా సరే మాస్టర్‌ప్లాన్‌లో ఉందంటూ రూ.500 కోట్లు విలువైన టీడీఆర్‌ను జారీచేసేశారు. ఈ వ్యవహరంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నాయుడుతోట జంక్షన్‌ నుంచి పొర్లుపాలెం వరకు ఉన్న ఆంధ్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ రోడ్డుపై పెద్దగా వాహనాల రద్దీ లేనప్పటికీ విస్తరించాలంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆగమేఘాల మీద ఆర్‌డీపీ చేసేశారు. టీడీఆర్‌ జారీకి ప్రయత్నాలు జరుగుతుండగా ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవ్వడంతో ఆ ప్రక్రియను పక్కనపెట్టారు. టౌన్‌ సర్వేయర్ల పనితీరుపై, వారిచ్చే సర్టిఫికెట్లపై ఎస్టేట్‌ విభాగం ఉన్నతాధికారులుగానీ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులుగానీ ఎందుచేతనో దృష్టిపెట్టడం లేదని జీవీఎంసీ అధికారులే పేర్కొంటు. తప్పుడు సర్టిపికేట్లు ఇచ్చేవారిపై కఠినచర్యలు తీసుకుంటే జీవీఎంసీ ఆస్తులకు రక్షణ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:21 AM