నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:59 AM
విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తయారుచేయాలని సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని, ఆ దిశగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సూచన
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తయారుచేయాలని సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని, ఆ దిశగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కేతన్‌గార్గ్‌ను పల్లా శ్రీనివాసరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ నగర అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే పల్లా వెంట మేయర్ పీలా శ్రీనివాసరావు, పార్టీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
తేలిన ఇంజనీరింగ్ సీట్ల లెక్క
ఉమ్మడి విశాఖలో 20,460
ఏయూలో 1,020
మరో 22 ప్రైవేటు కళాశాలల్లో 19,440...
గడిచిన ఏడాది కంటే 2,370 సీట్లు పెరుగుదల
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల లెక్క తేలింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్ల వివరాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 24 కాలేజీల్లో 20,460 సీట్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీలోని రెగ్యులర్, మహిళా ఇంజనీరింగ్ కాలేజీల్లో కలిపి 1,020 సీట్లు ఉన్నాయి. మరో 22 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 19,440 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 2025-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.
గడిచిన ఏడాదితో పోలిస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది 18,090 సీట్లకు మాత్రమే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఈ సీట్ల సంఖ్య 20 వేలు దాటింది. గత ఏడాదితో పోలిస్తే 2,370 సీట్లు పెరిగాయి. ఏయూలో గడిచిన ఏడాది 900 సీట్లలో ప్రవేశాలకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,020 సీట్లకు పెరిగింది. అంటే 120 సీట్లు పెరిగాయి. అలాగే, గడచిన ఏడాది 21 ప్రైవేటు కాలేజీల్లో 17,190 సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో కాలేజీ పెరిగింది. మొత్తం 22 కాలేజీల్లో 19,440 సీట్లు ఉన్నట్టు వెల్లడించింది. గడిచిన ఏడాదితో పోలిస్తే 2,250 సీట్లు పెరిగాయి. ఈ నెలాఖరు నాటికి తొలి దశ ప్రవేశాలు పూర్తిచేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఏసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు
నేటి నుంచే అమలు
ఆర్టీసీ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏసీ బస్సుల చార్జీలు పది శాతం మేర తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రీజియన్‌లో అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర కేటగిరీల్లో 16 ఏసీ సర్వీసులు ఉన్నాయి. ఇవి విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఏసీ సర్వీస్‌లకు డిమాండ్ తగ్గింది. సగటు ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి మించడం లేదు. ఈ విషయాన్ని రీజియన్ అధికారులు రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చార్జీల్లో పది శాతం రాయితీ ఇస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందని సూచించారు. ఈ మేరకు దూర ప్రాంతాలకు తిరిగే ఏసీ సర్వీసుల టికెట్లలో పది శాతం రాయితీ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ తగ్గింపు బుధవారం నుంచి అమలులోకి వస్తుందని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.