Share News

సబ్‌ ట్రెజరీ కుంభకోణంలో అధికారులపై చర్యకు మీనమేషాలు!

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:05 AM

సీతమ్మధార సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల సొమ్ము స్వాహా వ్యవహారంలో అధికారులపై చర్యకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సబ్‌ ట్రెజరీ కుంభకోణంలో అధికారులపై చర్యకు మీనమేషాలు!

  • ఉన్నతస్థాయి ఒత్తిళ్లే కారణం?

  • సీనియర్‌ అకౌంటెంట్లకు మాత్రమే చార్జిమెమోలు

  • ఉప, సహాయ ఖజానా అధికారుల పాత్రపై మౌనం

  • విజిలెన్స్‌ నివేదిక బహిర్గతం చేయాలంటున్న ఉద్యోగులు

విశాఖపట్నం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):

సీతమ్మధార సబ్‌ ట్రెజరీలో పింఛన్‌దారుల సొమ్ము స్వాహా వ్యవహారంలో అధికారులపై చర్యకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి 11 మంది సీనియర్‌ అకౌంటెంట్లకు జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చార్జిమెమోలు ఇచ్చిన సంగతి విదితమే. ఇందులో పలు కేడర్‌లకు చెందిన సుమారు 20 మంది అధికారుల పాత్ర కూడా ఉందంటున్నారు.

సీతమ్మధార సబ్‌ట్రెజరీలో 2011 నుంచి 2017 వరకు పింఛన్‌దారులకు సంబంధించి రూ.ఆరు కోట్ల వరకు స్వాహా జరిగిందని విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మొత్తం 36 మంది పాత్ర ఉన్నట్టు నిర్ధారించింది. అందులో ఇప్పటివరకూ నలుగురు చనిపోగా, 32 మంది ఉన్నారు. వారిలో కొందరు రిటైరయ్యారు. ఇంకా సర్వీస్‌లో 11 మంది సీనియర్‌ అకౌంటెంట్లు, మరికొందరు ఉప, సహాయ ఖజానా అధికారులు ఉన్నారు. సీనియర్‌ అకౌంటెంట్లకు జిల్లా స్థాయిలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదా కలిగిన జిల్లా ఖజానా అధికారి మోహనరావు చార్జిమెమోలు ఇచ్చారు. అధికారులు మాత్రం విజయవాడలోని ఖజానా శాఖ డైరెక్టరేట్‌ పరిధిలోకి వస్తారు. అధికారులకు చార్జిమెమోలు జారీ చేయకుండా ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత ఒకపక్క విచారణ జరుగుతుండగానే కొందరు సీనియర్‌ అకౌంటెంట్లకు ఉప ఖజనా అధికారులుగా, ఉప ఖజానా అధికారులకు సహాయ ఖజానా అధికారులుగా పదోన్నతులు కల్పించారు. నిబంధనల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకూడదు. కానీ సొమ్ములు తీసుకుని పదోన్నతులు ఇచ్చినట్టు చెబుతున్నారు. దోషులుగా విజిలెన్స్‌ గుర్తించిన అధికారులపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు కారణంగా ఇప్పుడు చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే చర్చ ఖజానా శాఖలో జరుగుతోంది. ఏపీ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఒక ఉద్యోగి/అధికారి పదవీ విరమణ చేసి నాలుగుళ్లు దాటితే...అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. సబ్‌ట్రెజరీ కుంభకోణంలో పాత్రధారులుగా తేలిన వారిలో పదవీ విరమణ చేసి నాలుగేళ్లు పూర్తికాని వారున్నారు. అందుకు కొద్దినెలలు మాత్రమే సమయం ఉన్నవారున్నారు. అటువంటి వారంతా చార్జిమెమోలు ఇవ్వకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లు పూర్తయిన తరువాత మెమోలు ఇచ్చినా సర్వీస్‌ రూల్స్‌ మేరకు చెల్లవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక బహిర్గతం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. నివేదికలో పేర్కొన్న ప్రతి ఉద్యోగి/అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 01:05 AM