Share News

‘పయనీర్‌’తో వంతెనకు ముప్పు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:15 AM

తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డులో మామిడివాక గెడ్డ వంతెన మీదుగా పరిమితికి మించిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే మాకవరపాలెం మండలం రాచపల్లిలోని పయనీర్‌ (గతంలో అన్‌రాక్‌) కంపెనీకి తాళాలు వేయిస్తానని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

‘పయనీర్‌’తో వంతెనకు ముప్పు
మామిడివాక గెడ్డ వంతెనను పరిశీలిస్తున్న శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూటమి నాయకులు, అధికారులు.

భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్న మామిడివాక గెడ్డ బ్రిడ్జి

నిబంధనలు పాటించకపోతే కంపెనీకి తాళాలు వేయిస్తా

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు హెచ్చరిక

కశింకోట, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డులో మామిడివాక గెడ్డ వంతెన మీదుగా పరిమితికి మించిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే మాకవరపాలెం మండలం రాచపల్లిలోని పయనీర్‌ (గతంలో అన్‌రాక్‌) కంపెనీకి తాళాలు వేయిస్తానని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ఏడాది క్రితం వరకు భేషుగ్గానే వుంది. అయితే పయనీర్‌ కంపెనీకి ముడిసరకు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలతో పలుచోట్ల దెబ్బతిన్నది. వారం రోజుల క్రితం ఆర్‌అండ్‌బీ నర్సీపట్నం డీఈ ఆర్‌ఆర్‌ విద్యాసాగర్‌ ఈ వంతెనను పరిశీలించారు. భారీ వాహనాల కారణంగా వంతెన దెబ్బతింటున్నట్టు గుర్తించారు. కొత్త వంతెన నిర్మించాలని, లేదంటే మరమ్మతులు చేసి, భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు నివేదించారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 20 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ వంతెన మీదుగా సుమారు 60 టన్నుల బరువుతో పయనీర్‌ కంపెనీకి ముడిసరకును రవాణా చేస్తున్నారన్నారు. దీనివల్ల వంతెనకు ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నిపుణులతో నాణ్యత పరిశీలన చేయించి, మరమ్మతులు చేయాలా? లేదంటే కొత్త వంతెన నిర్మించాలా? అన్నదానిపై నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వంతెన సామర్థ్యానికి మించి భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. అదే విధంఆ నర్సీపట్నం నుంచి చింతపల్లి మండలం లంబసింగి వరకు రోడ్డును విస్తరించాలని, దీనివల్ల రెండు జాతీయ రహదారులకు అనుసంధానం ఏర్పడి, రవాణా సదుపాయం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, నర్సీపట్నం డీఈ విద్యాసాగర్‌, అనకాపల్లి ఏఈ ఎన్‌.సాంబశివరావు, పెదబొడ్డేపల్లి ఏఈ కె.నారాయణరెడ్డి, నర్సీపట్నం ఏఈ ఎన్‌.ఎల్‌.నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:15 AM