పైనాపిల్ ధర పతనం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:18 AM
పైనాపిల్ ధర పతనం కావడంతో గిరిజన రైతులు డీలా పడ్డారు. గత సోమవారం వారపు సంతలో పైనాపిల్ ఒక్కోటి రూ.30కి విక్రయించారు. ఈ సోమవారం ఒక్కోటి రూ.6కి విక్రయించాల్సి రావడంతో ఆవేదన చెందారు.
గత వారం వారపు సంతలో ఒక్కోటి రూ.30కి విక్రయం
ఈ వారం రూ.6 పలికిన ధర
గిరిజన రైతులు డీలా
మాడుగుల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): పైనాపిల్ ధర పతనం కావడంతో గిరిజన రైతులు డీలా పడ్డారు. గత సోమవారం వారపు సంతలో పైనాపిల్ ఒక్కోటి రూ.30కి విక్రయించారు. ఈ సోమవారం ఒక్కోటి రూ.6కి విక్రయించాల్సి రావడంతో ఆవేదన చెందారు.
పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు దేవాపురం, సలుగు, కందులపాలెం, ఈదులపాలెం, వంట్లమామిడి, కక్కి నుంచి గిరిజన రైతులు ఇక్కడ జరిగిన వారపు సంతలో విక్రయించేందుకు పండించిన పైనాపిల్, పనస పండ్లను సోమవారం తీసుకువచ్చారు. వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రమే ఇక్కడికి చేరుకున్నారు. సోమవారం వారపు సంతకు వ్యాపారులు ఎక్కువ మంది రాలేదు. పైనాపిల్‌ను కొనుగోలు చేసేవారు లేక తొలుత ఒక్కోటి రూ.14కు విక్రయించగా, గంట తరువాత ఒక్కసారిగా రూ.8 నుంచి రూ.6లకు ధర పడిపోయింది. వర్షం కారణంగా పండ్లను తిరిగి తీసుకు వెళ్లలేక ఆ ధరకే రైతులు విక్రయించాల్సి వచ్చింది. అలాగే గత వారం పనస పండు పెద్దది రూ.60కి విక్రయించగా, ఈ వారం రూ.10 నుంచి రూ.20 మధ్య ధర పలకడంతో గత్యంతరం లేక విక్రయించారు. ఒక్కసారిగా ధరలు తగ్గిపోవడంతో ఆటో ఖర్చులకు కూడా రాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.