దుర్భరంగా పినగాడి-కోటపాడు రోడ్డు
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:37 AM
పినగాడి నుంచి కె.కోటపాడు వెళ్లే రోడ్డులో మండలంలోని పలు గ్రామాల వద్ద ఇరువైపులా ఆక్రమణల కారణంగా రహదారి ఇరుకుగా మారింది. ఆర్‌అండ్‌బీకి చెందిన డ్రైనేజీ కాలువలు, గెడ్డ స్థలాలు సైతం కబ్బాకు గురయ్యాయి. రోడ్డుకన్నా మార్జిన్లు ఎత్తుగా వుండడంతో వర్షం నీరు రహదారిపైనే నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నది.
ఇరువైపులా ఆక్రమణలు
రహదారిపైనే వర్షం నీరు
రాకపోకలకు వాహనదారుల ఇక్కట్లు
త్వరగా పాడైపోతున్న రోడ్డు
సబ్బవరం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పినగాడి నుంచి కె.కోటపాడు వెళ్లే రోడ్డులో మండలంలోని పలు గ్రామాల వద్ద ఇరువైపులా ఆక్రమణల కారణంగా రహదారి ఇరుకుగా మారింది. ఆర్‌అండ్‌బీకి చెందిన డ్రైనేజీ కాలువలు, గెడ్డ స్థలాలు సైతం కబ్బాకు గురయ్యాయి. రోడ్డుకన్నా మార్జిన్లు ఎత్తుగా వుండడంతో వర్షం నీరు రహదారిపైనే నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి పినగాడి జంక్షన్ నుంచి మొగలిపురం మీదుగా మలునాయుడుపాలెం వరకు కనిపిస్తుంది. మలునాయుడుపాలెం వద్ద డ్రైనేజీ కాలువలు ఆక్రమణకు గురవడంతో మురుగు నీరు, వర్షం నీరు కలసి రోడ్డుపై ప్రవహించి, బురద పేరుకుపోతున్నది. వర్షం కురిసినప్పుడల్లా రహదారిపై నీరు నిలిచిపోతుండడంతో గోతులు ఏర్పడి, త్వరగా పాడైపోతున్నది. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని, రహదారికి ఇరువైపులా పూడికలను తొలగించాలని ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.