Share News

ఫార్మాసిటీలో వ్యర్థాల గుట్టలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:12 AM

పరవాడలో రాంకీ ఫార్మా సిటీ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామిక వ్యర్థాలను టన్నుల కొద్దీ నిల్వ చేస్తోంది. వాటి నుంచి బయటకు వచ్చే రసాయనాలు పరిసర ప్రాంతాల వ్యవసాయ భూముల్లో చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు హెచ్చరించినా యాజమాన్యం ఖాతరు చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోంది.

ఫార్మాసిటీలో  వ్యర్థాల గుట్టలు
అనుమతులు లేకుండా నిల్వ చేసిన వ్యర్థాల గుట్టలు

అనుమతులు లేకుండా టన్నుల కొద్దీ నిల్వ

పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితం

ప్రాజెక్టు నిర్వహణలో నిబంధనలు బేఖాతరు

గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ప్రజా సంఘాల కేసు

ఈ నెలలోనే నాలుగుసార్లు పీసీపీ తనిఖీలు

వివరణ కోరుతూ నోటీసులు జారీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పరవాడలో రాంకీ ఫార్మా సిటీ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామిక వ్యర్థాలను టన్నుల కొద్దీ నిల్వ చేస్తోంది. వాటి నుంచి బయటకు వచ్చే రసాయనాలు పరిసర ప్రాంతాల వ్యవసాయ భూముల్లో చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు హెచ్చరించినా యాజమాన్యం ఖాతరు చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతోంది.

ఫార్మా సిటీలో వ్యర్థాల నిర్వహణకు ‘కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు’ నడుపుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి, శుద్ధి చేశాక భద్రంగా నిల్వ చేసి, ఆ తరువాత వాటిని అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తరలించాలి. ఇందు కోసం 18.07 ఎకరాలను కేటాయించారు. అందులో 9.11 ఎకరాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ ఫిల్‌ (వ్యర్థాలు నిల్వ చేయడానికి)కు అనుమతి ఇచ్చింది. మిగిలిన 8.96 ఎకరాలకు యాజమాన్య హక్కుల విషయంలో వివాదాలు ఉండడంతో నోటిఫై చేయలేదు. రెండు దశాబ్దాలు గడిచినా ఆ వివాదం పరిష్కారం కాలేదు. అయినా ఫార్మా సిటీ యాజమాన్యం మొత్తం 18.07 ఎకరాలను వాడుకుంటోంది. అందులో ఇప్పటివరకూ 17,20,55 టన్నుల వ్యర్థాలను నిల్వ చేసింది. పరిమితి దాటి పోయింది. ఆ వ్యర్థాలను వేరే ప్రాంతాలకు తరలించి, ఆ తరువాత కొత్త వ్యర్థాలు తీసుకోవాలి. కానీ యాజమాన్యం అలా చేయడం లేదు. పక్కనే ఏపీఐఐసీకి చెందిన 50 ఎకరాల స్థలం ఉంటే అందులో 20 ఎకరాలను వ్యర్థాల డంపింగ్‌కు వాడుకుంటోంది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వ చేయడం, పరిశ్రమల నుంచే బూడిద వంటి వ్యర్థాలను బయట నిల్వ చేయడం వల్ల గాలి, నీరు కలుషితమవుతున్నాయి. వ్యర్థ రసాయనాలను స్థానిక చెరువులు, గెడ్డలోకి అనధికారికంగా విడిచిపెడుతోంది. వీటిపై ఫిర్యాదులు అందడంతో ఏపీ పీసీబీ అధికారులు ఈ నెలలోనే నాలుగుసార్లు (12, 13, 17, 18 తేదీల్లో) తనిఖీలు చేశారు. అనేక లోపాలు గుర్తించారు. నిబంధనలు పాటించడం లేదని తేల్చారు. నోటీసులు జారీచేశారు. ల్యాండ్‌ ఫిల్‌ పాండ్‌లో వ్యర్థాలను తరలించేంత వరకు కొత్త వ్యర్థాలను తీసుకురాకూడదని హెచ్చరించారు. నిల్వ చేసిన వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. బూడిద నిల్వలపై టార్పాలిన్లు కప్పాలని, గాలికి ఎగరకుండా చూడాలని సూచించారు. అక్కడి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంటులోకి వచ్చే వాహనాలను శుభ్రం చేసేందుకు శాశ్వత ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని నోటీసు జారీచేశారు. ఆ తరువాత యాజమాన్యాన్ని విచారణకు పిలిచి, ప్రభుత్వానికి నివేదిక పంపించి, తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఎన్‌జీటీలో కేసు

విశాఖ ఫార్మా సిటీ కాలుష్యంపై స్థానిక ప్రజా సంఘాలు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కేసు వేశాయి. తానాం గ్రీన్‌ బెల్ట్‌లోని బఫర్‌ జోన్‌లో చెరువు తవ్వారని, అది నిబంధనలకు వ్యతిరేకమని ఆరోపించాయి.

- పరిశ్రమల రసాయన వ్యర్థాలను పరవాడలోని మొల్లేటి గెడ్డలోకి విడిచి పెడుతున్నారని, దానివల్ల తాగునీరు కలుషితం అవుతోందని ఫిర్యాదు చేశారు.

- తాడి గ్రామంలోని ల్యాండ్‌ ఫిల్‌ (వ్యర్థాలు నిల్వ చేసే పాండ్‌) పూర్తిగా నిండిపోయిందని, అనధికారికంగా నిల్వ చేస్తున్నారని పేర్కొన్నారు.

వీటన్నింటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీపీసీబీని ఎన్‌జీటీ ఆదేశించింది. అధికారులు నివేదిక సమర్పించగా, దానిపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. ఎన్‌జీటీలో కేసు ఉన్నా సరే విశాఖ ఫార్మా సిటీ యాజమాన్యం ఇప్పటికీ అవే తప్పులు చేయడం లెక్కలేనితనాన్ని రుజువు చేస్తున్నదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:12 AM