పిక్నిక్‌లకు చలో చలో..
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:29 PM
కార్తీక మాసం కావడంతో మండలంలోని పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. మైదాన ప్రాంతాల నుంచి పిక్నిక్‌లకు తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం, కృష్ణాపురం ఎకో టూరిజం పార్కుకు తరలి వస్తున్నారు.
తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం, కృష్ణాపురం ఎకో టూరిజం పార్కులో సందడి
చింతపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం కావడంతో మండలంలోని పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. మైదాన ప్రాంతాల నుంచి పిక్నిక్‌లకు తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం, కృష్ణాపురం ఎకో టూరిజం పార్కుకు తరలి వస్తున్నారు.
తాజంగి జలాశయానికి వెళ్లాలంటే..
ఆంరఽధ కశ్మీర్ లంబసింగికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంది. జలాశయానికి సమీపంలో విశాలమైన మైదానం ఉంది. ఇక్కడే వన భోజనాలు చేస్తుంటారు. జలాశయం వద్ద వనభోజనాలు చేసిన తరువాత జిప్‌లైన్, ఆర్చరీ క్రీడలతో పాటు జలాశయంలో బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజంగి జలాశయం నర్సీపట్నానికి 36 కిలోమీటర్లు, చింతపల్లికి 22 కిలో మీటర్ల దూరంలో వుంది. చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారికి లంబసింగి జంక్షన్ నుంచి వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో జలాశయానికి వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు.
కృష్ణాపురం ఎకో టూరిజం..
పాడేరు, చింతపల్లి వెళ్లే మార్గంలో లోతుగెడ్డ జంక్షన్‌కి కిలోమీటరు దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని అటవీశాఖకు చెందిన కృష్ణాపురం ఎకో టూరిజం పార్కు ఉంది. ఆరు ఎకరాల పైన్ తోటల్లో ఎకో టూరిజాన్ని అటవీశాఖ అభివృద్ధి చేసింది. పర్యాటకుల కోసం సింగిల్, డబుల్ టెంట్లు, వాష్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ పాత్ ఉంది. పచ్చని చెట్ల కింద భోజనాలు చేసేందుకు ఓపెన్ వుడ్ డైనింగ్ టేబుళ్లు ఉన్నాయి. ఆటవిడుపు కోసం ఆర్చరీ, ఊయలలు ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలు చేసేందుకు సందర్శకులు ముందుగా ఓపెన్ గ్రౌండ్‌ను నామమాత్రపు ధర చెల్లించి బుక్ చేసుకోవాలి. సందర్శకులు 9014060702, 9441107646 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
యర్రవరం జలపాతం..
యర్రవరం జలపాతానికి కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. జలపాతం వద్ద సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి అతివేగంగా కిందకు నీరు ప్రవహిస్తుంది. ఈ జలపాతం వెడల్పు దాదాపు 300 అడుగులు ఉంటుంది. జలపాతం దిగువన చాపరాయి కూడావుంది. జలపాతానికి వచ్చిన పర్యాటకులు చాపరాయిలోగాని, చుట్టూ ఉన్న చెట్ల నీడన గాని వనభోజనాలు చేసే అవకాశముంది. జలపాతంలో స్నానాలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే జలపాతం వద్ద తాగునీరు అందుబాటులో లేదు. యర్రవరం జలపాతానికి వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో మాత్రమే చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్ సౌకర్యం అందుబాటులో లేదు. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో 16 కిలోమీటర్లు ప్రయణిస్తే లంబసింగి ఘాట్ ప్రారంభంకాగానే తురబాడుగెడ్డ గ్రామం వస్తుంది. ఈ గ్రామం నుంచి సమగిరి మీదుగా జలపాతానికి వెళ్లాలి.