జిల్లాలో ఫేస్-2 పనులు పునఃప్రారంభించాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:27 PM
జిల్లాలో ఫేస్-2లో మంజూరై నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
ఆగిపోయిన పనులను పరిశీలించి నివేదిక తయారు చేయాలి
జాబితాను పకడ్బందీగా తయారు చేయకుంటే చర్యలు
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ హెచ్చరిక
అరకులోయ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫేస్-2లో మంజూరై నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో రవ్వలగుడలోని ఏటీడబ్ల్యూ ఆశ్రమ స్కూల్‌లో సమగ్ర గిరిజన ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫేస్-2లో పనులు ఏయే ఇంజనీరింగ్‌శాఖకు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. ఫేస్-2లో ఆగిపోయిన పనులను టీడబ్ల్యూ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి వాటి స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఫేస్-2లో మొదలు కాని పనులకు ప్రతిపాదనలను అక్టోబరు 10లోగా పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరుగుదొడ్ల జాబితాను ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖాధికారులు కలిసి తనిఖీ చేసి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బేస్‌లైన్ ట్రైనింగ్ కార్యక్రమానికి (ఎఫ్‌ఎల్‌ఎస్) టీచర్లు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తప్పకుండా హాజరుకావాలన్నారు. మాస్టర్స్ ట్రైనీలకు బేస్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తయిందన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని అధికారులను ఆదేశించారు. తనతో పాటు ఐటీడీఏ పీవో, ఎమ్మార్వో, ఎంపీడీవోలు తనిఖీ చేస్తామన్నారు. జిల్లాలో రాబోయే కాలంలో పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలల్లో ఎక్కడైతే సరైన ఫలితాలు రావో అక్కడ సంబంధిత టీచర్, హెచ్‌ఎం, ఏటీడబ్ల్యూవో, ఎంఈవోలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీడీఏల వారీగా పీఎంఆర్పీలో అకడమిక్ మోనిటరింగ్ సెల్ ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఎ పీవో టి.శ్రీపూజ, వర్చువల్‌గా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు బి.స్మరణరాజ్, శుభం నొక్వాల్, సమగ్రశిక్ష అధికారి స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీ, టీడబ్ల్యూ ఇంజనీరింగ్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, 22 మండలాల మూడు శాఖల డీఈఈలు, ఏఈలు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.