డంపర్ లారీ ఢీకొని ఫార్మా ఉద్యోగి మృతి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:41 AM
స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కంపెనీకి వెళుతుండగా అచ్యుతాపురం కూడలిలో ఎలమంచిలి వైపు నుంచి వస్తున్న భారీ డంపర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

అచ్యుతాపురం జంక్షన్‌లో ఘటన
అచ్యుతాపురం, ఏప్రిల్ 4 (ఆంరఽధజ్యోతి): స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కంపెనీకి వెళుతుండగా అచ్యుతాపురం కూడలిలో ఎలమంచిలి వైపు నుంచి వస్తున్న భారీ డంపర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గెద్దవలస నరసింహపురం (జీఎన్ పురం) గ్రామానికి చెందిన బగాది రమణారావు (40) పరవాడలో ఫార్మా సిటీలోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలోని బర్మాకాలనీలో నివాసం వుంటున్నాడు. రోజూ బైక్‌పై కంపెనీకి వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం మొదటి షిఫ్ట్ విధులకు హాజరు కావడానికి ఉదయం 5.30 గంటల సమయంలో బైక్‌పై బయలుదేరాడు. దారిలో అచ్యుతాపురం జంక్షన్ వద్ద కుడివైపునకు తిరుగుతుండగా, ఇదే సమయంలో రాంబిల్లి మండలంలోని ఎన్‌ఏఓబీలో బండరాళ్లను అన్‌లోడ్ చేసి వస్తున్న డంపర్ లారీ, బైక్‌ను ఢీకొన్నది. దీంతో రమణారావు కిందపడిపోయాడు. అక్కడ వున్న వారు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ డంపర్ లారీని రివర్స్ చేశాడు. ఈ క్రమంలో రమణారావు తల మీద నుంచి ముందు టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ నమ్మి గణేశ్, పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.