ఫణిగిరి ప్రదక్షిణ రేపు
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:37 AM
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5వ తేదీన పంచదార్లలో కొలువైన ఉమాధర్మలింగేశ్వరస్వామివారి ఫణిగిరి ప్రదక్షిణకు దేవదాయ శాఖ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు మండలాలు 18 గ్రామాల మీదుగా 24 కి.మీ. సాగనున్న యాత్ర
ఏర్పాట్లు చేస్తున్న దేవదాయ శాఖ
రాంబిల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5వ తేదీన పంచదార్లలో కొలువైన ఉమాధర్మలింగేశ్వరస్వామివారి ఫణిగిరి ప్రదక్షిణకు దేవదాయ శాఖ అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ధారభోగాపురం వద్ద మొదలయ్యే ఈ యాత్ర ధారపాలెం, పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడకపాలెం, చర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, యర్రవరం, కొండకర్ల, చోడపల్లి, అచ్యుతాపురం, వెదురువాడ, గొర్లె ధర్మవరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా కొండదిగువున రాధామాధవస్వామి ఆలయానికి చేరుతుంది. ఇక్కడ ఆకాశ ధారలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఫణిగిరిపై ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మూడు మండలాల పరిధిలో 24 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.