Share News

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను వేగంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:11 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందే అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను వేగంగా పరిష్కరించాలి
అర్జీదారుని సమస్యను ఆలకిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందే అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ సత్యనారాయణరావులతో కలసి ఆమె ప్రజలను నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలు అందజేసిన అర్జీల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని అర్జీదారులకు నిర్ణీత సమయంలో న్యాయం చేయాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిష్కరించడానికి వీలుకాని పక్షంలో అందుకుగల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. కాగా పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 291 అర్జీలు అందాయని కలెక్టరేట్‌ విభాగం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో...

పీజీఆర్‌ఎస్‌లో అందే అర్జీలు/ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు భరోసా ఇవ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా పోలీసులు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్జీలను నిశితంగా పరిశీలించి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాల వాస్తవికతను నిర్ధారించిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీ అందిన ఏడు రోజులలోపు విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు. మొత్తం 35 అర్జీలు అందగా.. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు వంటి వాటికి సంబంధించినవి అధికంగా వున్నట్టు జిల్లా పోలీస్‌ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (క్రైమ్‌) ఎల్‌.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:11 PM