పీజీఆర్‌ఎస్ అర్జీలను త్వరగా క్లియర్ చేయాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:57 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను క్లియర్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను క్లియర్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ సత్యనారాయణరావుతో కలిసి నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రలజు అందజేసిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. ఒకే సమస్యకు సంబంధించి ప్రజలు పలుమార్లు అర్జీలు అందజేయాల్సిన అవసరం లేకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలకు లోబడి పరిష్కరించలేని వాటి గురించి సంబంధిత అర్జీదారులకు తెలియజేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలకు సంబంధించి 344 అర్జీలు అందాయని కలెక్టరేట్ విభాగం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీలు సుబ్బలక్ష్మి, రమామణి, అనిత, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌సిన్హా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీపై ఏడు రోజుల్లో విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 46 అర్జీలు అందినట్టు జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు వెల్లడించారు.