Share News

పెట్రోలియం వర్సిటీ రెడీ

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:50 AM

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)కి శాశ్వత క్యాంపస్‌ సిద్ధమైంది.

పెట్రోలియం వర్సిటీ రెడీ

సబ్బవరం మండలం వంగలిలో రూ.400 కోట్లతో భవనాల నిర్మాణం

మరో రూ.100 కోట్లతో ల్యాబ్‌, రూ.50 కోట్లతో ఫర్నీచర్‌, ఇతర వసతులు

జనవరి ఐదో తేదీ నుంచి నూతన క్యాంపస్‌లో తరగతులు ప్రారంభానికి సన్నాహాలు

ప్రస్తుతం ఏయూలో నిర్వహణ

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)కి శాశ్వత క్యాంపస్‌ సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 157.36 ఎకరాల్లో భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి అక్కడకు షిఫ్ట్‌ అయ్యేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి శాశ్వత క్యాంపస్‌కు వెళ్లాలని అధికారులు భావించారు. అయితే, కొన్ని పనులు పెండింగ్‌లో ఉండడం, ఇతర కారణాలతో జనవరి ఐదో తేదీ నుంచి శాశ్వత క్యాంపస్‌లో తరగతులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

వంగలిలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో భవన నిర్మాణాలను చేపట్టారు. మరో రూ.100 కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ, లైబ్రరీ, మరో రూ.50 కోట్లతో ఫర్నీచర్‌, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్నారు. ప్రస్తుతం వర్సిటీ అవసరాలకు అనుగుణంగా మొదటి ఫేజ్‌ నిర్మాణాలను పూర్తిచేశారు. భవిష్యత్తు అవసరాల కోసం రెండో ఫేజ్‌ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరుచేసింది.

విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీని రాష్ట్రానికి కేటాయించగా, 2016 నుంచి ఏయూలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పెట్రోలియం ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎమ్మెస్సీ అప్లైడ్‌ జియాలజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

గిృహ రేటింగ్‌ సాధించేలా..

వాతావరణానికి హాని కలిగించకుండా, సహజ వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఉండే భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ రేటింగ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ హాబిటేట్‌ అసెస్‌మెంట్‌ (గిృహ) పేరుతో రేటింగ్స్‌ ఇస్తోంది. గిృహ రేటింగ్‌ 4 సాధించేలా పెట్రోలియం వర్సిటీ భవన నిర్మాణాలను పూర్తిచేశారు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు, వినియోగించిన నీరు రీసైక్లింగ్‌ చేసే టెక్నాలజీ, తరగతి గదులు, ఇతర హాల్స్‌లోకి వెంటిలేషన్‌ వచ్చేలా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడుతూ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులకు నాలుగు వారాలు సెలవులు ఉంటాయని, అనంతరం నేరుగా నూతన క్యాంపస్‌లోకి వస్తారన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:50 AM