పసుపు పంటను తెగుళ్ల బెడద
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:07 PM
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న పసుపు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే తెగుళ్లను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివాసీ రైతులు అధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారు.
తాటాకు మచ్చ, ఆకు మచ్చను సకాలంలో నివారించుకోవాలి
నిర్లక్ష్యం చేస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం
ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచన
చింతపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న పసుపు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే తెగుళ్లను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివాసీ రైతులు అధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 25 వేల హెక్టారుల్లో పసుపు సాగు జరుగుతోంది. ప్రధానంగా ఏజెన్సీ రైతులు దేశవాళి రకాలను సాగు చేసుకుంటున్నారు. దీనికి తోడు రైతులు పసుపును రెండేళ్ల పంటగా సాగుచేస్తున్నారు. పసుపు పంటను రెండేళ్లపాటు సాగచేయడం వల్ల సమయం, దిగుబడి కూడా రైతులు నష్టపోతున్నారని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసుపును 8-9 నెలల పంటగానే సాగుచేసుకోవాలని శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు. అయితే అధిక శాతం రైతులు ఇప్పటికీ రెండేళ్ల పంటగానే సాగుచేస్తున్నారు. రైతులు మార్చిలో పసుపు నాట్లువేసుకున్నారు. ప్రస్తుతం మొక్కలు అడుగు నుంచి అడుగున్నర ఎత్తులో వున్నాయి. ప్రస్తుత కాలంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రత తక్కువగా వుండడంతో ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ ప్రధానంగా పసుపు పంటను తాటాకు మచ్చ, ఆకు మచ్చ తెగులు ఆశిస్తుందని, సకాలంలో నివారించుకుంటే ప్రమాదం ఉండదని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాటాకు మచ్చ తెగులు
ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు అండాకారంలో కనిపిస్తే తాటాకు మచ్చ తెగులు సోకిందని రైతులు గుర్తించాలి. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో వుండి, మచ్చచుట్టూ పసుపు రంగు వలయం వుంటుంది. ఆకు కాడపై కూడా మచ్చలు ఏర్పడి కాండం ఆకువాలిపోతుంది.
ఆకు మచ్చ తెగులు
ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడితే ఆకు మచ్చ తెగులు సోకిందని గుర్తించాలి. అనంతరం ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారుతాయి. తెగులు ఉధృతమైతే ఆకు పూర్తిగా మాడిపోతోంది.