భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:00 AM
పదేపదే తలెత్తుతున్న భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు.
గందరగోళం లేకుండా రీసర్వే జరగాలి
ఆ ప్రక్రియ పూర్తయిన భూములకు మ్యుటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలి
అధికారులకు రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు నిర్దేశం
జమాబందీ విధానాన్ని పునఃప్రారంభించాలన్న కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే కొణతాల
జిరాయితీ భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలని కోరిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
పదేపదే తలెత్తుతున్న భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఫిర్యాదుల కమిటీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమగ్ర భూసర్వే, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, రికార్డుల నిర్వహణ, సరిహద్దుల గుర్తింపు అభ్యంతరాల స్వీకరణ, తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారద్శకంగా నిర్వహించాలని, లోపాలు తలెత్తకుండా గందరగోళం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీసర్వే చేయనున్న గ్రామాల్లో ముందుగా దండోరా వేయించి గ్రామ సభలు విధిగా నిర్వహించి ప్రక్రియను సజావుగా చేపట్టాలని స్పష్టంచేశారు. రైతుల సమక్షంలో ప్రక్రియ మొత్తం సాగాలని, అభ్యంతరాల స్వీకరణకు వీలుగా మొబైల్ మేజిస్ట్రేట్ బృందాలు అందుబాటులో ఉండాలన్నారు. అశాంతికి, గందరగోళానికి తావులేకుండా రీసర్వే చేయాలని, ఒకవేళ వివాదాలు తలెత్తితే ఇరుపక్షాల సమక్షంలో పరిష్కార చర్యలు చేపట్టాలని, అనివార్యకారణాలతో ఒక వర్గం రాకపోతే మరో అవకాశం ఇవ్వాలని, అప్పటికీ రాకపోతే సుమోటోగా తీసుకుని నిబంధనలకు అనుగుణంగా అధికారులు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టంచేశారు. రీసర్వే అయిన భూములకు మ్యుటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారానికి గడువు రెండేళ్లకు పెంచాలని కమిటీ అభిప్రాయపడిందని రఘురామకృష్ణరాజు అన్నారు. దీన్ని సీసీఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్లి ఆచరణలో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ ప్రతిపాదించిన అంశాలలో దీన్ని ప్రధానంగా చేర్చాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రైతుల సమస్యలు పరిష్కారం కోసం జిల్లా స్థాయి అధికారి నుంచి వీఆర్వో వరకు ఏడాదికి ఒకసారి గ్రామాల్లో అందుబాటులో ఉండేలా జమాబందీ విధానాన్ని పునఃప్రవేశపెట్టాలని సూచించారు. భూఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలన్నారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ భూములు రీసర్వే చేసినప్పుడు కొన్నిచోట్ల జిరాయితీ భూములు 22-ఎలో పెట్టారని పేర్కొంటూ అటువంటి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు. గంభీరంలో సర్వేనంబరు 228-4లో ఒక వ్యక్తి కొనుగోలు చేసిన జిరాయితీ భూమిని 22-ఎలో పెట్టారని పేర్కొంటూ ఇటువంటివి చాలా ఉన్నాయన్నారు. గాజువాక ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకర్మాగారం పరిధిలో ఆర్.కార్డులు పొందిన వారిలో 472 మంది ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికంగా ఉన్న విమల విద్యాలయం పరిస్థితిని ప్రస్తావించి సమస్య పరిష్కరించాలన్నారు. ఉక్కు కర్మాగారం పరిధిలో ఉన్న బస్ డిపో, గంగవరం మత్స్యకారులకు జట్టీ నిర్మాణం, ఏపీఐఐసీ లేఅవుట్, అపెరల్ పార్కును 22-ఎ నుంచి తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో శాసనసభా డిప్యూటీ సెక్రటరీ రాజ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, సర్వే విభాగం డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు సంగీత్‌మాథుర్, సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.