పోలీసు శాఖకు శాశ్వత భవనాలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:14 AM
మూడున్నరేళ్ల క్రితం జిల్లాల విభజనతో విశాఖ రూరల్ ఎస్పీ కార్యాలయం అనకాపల్లికి తరలిపోయింది.
రూరల్ ఎస్పీ కార్యాలయంలో కోస్టల్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్
ఎస్పీ బంగ్లాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ల రీసెర్చి అండ్ ట్రైనింగ్ సెంటర్
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఆర్మ్‌డ్ రిజర్వ్ మైదానం
విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
మూడున్నరేళ్ల క్రితం జిల్లాల విభజనతో విశాఖ రూరల్ ఎస్పీ కార్యాలయం అనకాపల్లికి తరలిపోయింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ కార్యాలయం, బంగ్లా, కైలాసగిరిలోని ఆర్మ్‌డ్ రిజర్వు ప్రధాన కార్యాలయం, సిబ్బంది క్వార్టర్స్, పరేడ్ మైదానం, అతిథిగృహాలను తాజాగా పోలీస్ శాఖలో పలు విభాగాలు కేటాయించారు.
ఈ మేరకు డీజీ కార్యాలయం గతనెలలోనే ఉత్తర్వులు జారీచేసింది. త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని కోస్టల్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్‌కు కేటాయించారు. ఐజీ హోదా కలిగిన ఉన్నతాధికారి నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంత భద్రతను కోస్టల్ సెక్యూరిటీ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం కోస్టల్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్ సిరిపురం వీఎంఆర్‌డీఏ భవనంలో కొనసాగుతోంది. తాజా కేటాయింపుతో ఈ భవనానికి బోర్డు ఏర్పాటుచేసిన అధికారులు మరమ్మతులు చేయిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లే మార్గం (ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురు రోడ్డు)లో ఉన్న ఎస్పీ బంగ్లాను సీనియర్ పోలీస్ ఆఫీసర్ల రీసెర్చి అండ్ ట్రైనింగ్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కైలాసగిరిలోని ఆర్మ్‌డ్ రిజర్వు మైదానం, సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవనాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి కేటాయించారు. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విశాలమైన మైదానం, క్వార్టర్స్ ఈ విభాగానికి కేటా యించారు. ఇదే ప్రాంతంలో గల ఎస్పీ అతిథి గృహాన్ని డీజీపీ రీజనల్ ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కేటాయించారు. ఆ భవనాలకు మరమ్మతులు చేయించి కొత్త విభాగాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.